Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వర్షంలోనూ కొనసాగుతున్న దీక్షలు
నవతెలంగాణ-కారేపల్లి
పోడే ఆ కుటుంబానికి జీవనాధారం, మెగా పార్క్ పేరుతో అదే పోతుందని తెలిసి తల్లడిల్లుతున్న బచ్చలి పొట్టెయ్య-మంగమ్మ కుటుంబం పోడులోనే దీక్షను సాగిస్తున్నారు. దీక్షలపై డ్రామాలంటూ అధికారుల సూటిపోటి మాటలకు ఊబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ దీక్షను సాగిస్తున్నారు. వర్షపు జల్లులు పడుతున్నా లెక్కచేయక ఆడ పిల్లలు చావైనా పోడులోనే అంటూ ఆ కుటుంబం పురుగుమందు డబ్బాలతో దీక్ష చేస్తుంండతో అక్కడి వారిని ఆలోచింపజేస్తుంది. అమాయక ఆదివాసి గిరిజన కుటుంబంలో మెగా పార్క్ తీవ్ర అలజడిని సృష్టిస్తుంది. బచ్చలి పొట్టెయ్య-మంగమ్మలు సాగుచేసుకుంటున్న 9.04 ఎకరాల పోడు భూమికి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం క్లెయిమ్ నెం. 222017010010005 ద్వారా ప్రభుత్వం హక్కు కల్పించింది. దీనిపై ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు 2019వరకు పొందారు. పొట్టెయ్య మృతి చెందటంతో ఆ పోడు భూమిని బచ్చల మంగమ్మ తన ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లతో సాగు చేసుకోని జీవనం సాగిస్తున్నారు. పొట్టెయ్య రెండో కుమారుడు కోడలు మల్లేష్- రాధలు అనారోగ్యంతో మృతి చెందారు. వారి ఇద్దరు ఆడ పిల్లలు మేఘన, వెన్నెల లు నానమ్మ మంగమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. మల్లేష్ చనిపోవటంతో ఆ వాటాకు వచ్చిన పోడు బీడుగా మారింది. పిల్లలు పెద్ద అయ్యాక సాగు చేసుకుంటారని ఆ కుటుంబం తలచింది. కాని ఈలోపు కుటుంబానికి తెలియకుండానే అధికారులు రీ సర్వే అంటూ సాగు చేయని పోడు భూమికి 2020 నుండి రైతు బంధు నిలిపివేశారు. ఇప్పుడు అసలు భూమినే లేకుండా చేయాలని చూస్తుండటంతో ఆ కుటుంబం పోడుపై పోరుబాట పట్టింది. వీరికి మానవత్వం ఉన్న పోడు రైతులు, గిరిజన సంఘాలు మద్దతుగా నిలబడ్డాయి. అయినా అధికారులు రోజు వారి బెదిరింపులతో ఆ కుటుంబం తల్లడిల్లుతుంది. తమ న్యాయమైన సమస్యపై అండగా నిలవాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది. ఈ దీక్షలకు పోడు రైతులు ఎరిపోతు భద్రయ్య, మన్నెం బ్రహ్మయ్య, ఎరిపోతు నాగయ్య, శేరు భద్రయ్య, మాలోత్ రాంకోటిలు సంఘీభావం ప్రకటించారు.