Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, ఎలక్టీషియన్లు, పంపు ఆపరేటర్స్ తదితర విభాగాల కార్మికులకు వెంటనే వేతనాలు పెంచి కేటగిరీల వారీగా అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకువేతనాలు పెంచి జీఓలను జారీ చేసిందని, జూన్ నెల నుండే వేతనాలు చెల్లిస్తామన్నారని, కానీ ఇంతవరకూ ఏ ఒక్క మున్సిపాల్టీలో కూడా పెంచిన వేతనాలు చెల్లిం చలేదన్నారు. ప్రభుత్వం జీఓలు జారీచేసి చేతులు దులుపుకొని వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తక్షణమే వేతనాలు సాధించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నెల 6, 7 మున్సిపల్ కమి షనర్లకు, మేయర్లకు వినతి పత్రం ఇవ్వాలని, 13న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి, అక్టోబర్ 10న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, యూనియన్ జిల్లా కార్యదర్శి జినక శ్రీను, నాయకులు దొడ్డా నరసింహారావు, నాగేశ్వరరావు, విజయ, సోమేశ్వరి అరుణ, వెంకటరమణ పాల్గొన్నారు.