Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 342 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా తిరుమలాయపాలెం మండలంలో అత్యధికంగా 150.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మండలంలోని బచ్చోడు గ్రామంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీంతో మండలంలోని చెరువులు, కుంటలు అలుగులు పారాయి. బచ్చోడు మీదుగా మర్రిపెడ బంగ్లాకు వెళ్లే మార్గంలోని రోడ్డు మీదుగా బచ్చోడు చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, మిరప పంటలో నీళ్లు నిలిచాయి. వరి పొలాలు నీటమునిగాయి.
సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మంగళవారం తెల్లవారుజాము నుండే మండలంలోని చెరువులు, కుంటలు అలుగులు పారాయి. సుబ్లేడు ముత్యాలమ్మ కుంటలోకి భారీగా వరద ఉధృతి రావడంతో రోడ్డుపై నుండి నీళ్ళు ప్రవహించటంతో రోడ్డు సగం వరకు కొట్టుకుపోయినది. వరద ఉధృతి తగ్గకపోతే చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని ఆ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బచ్చోడు పెద్ద చెరువు అలుగు నిర్మాణంలో వంతెన లేకపోవడంతో బచ్చోడు గ్రామ ప్రజలు వ్యవసాయ భూముల వద్దకు వెళ్ళటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నుండే హస్నాబాద్, సుబ్లేడు నుండి మరిపెడ బంగ్లా వెళ్ళాలి. దీంతో బాటసారులు ఇబ్బందులు పడ్డారు. జూపెడ, కాకరవాయి, బీరోలు, తాళ్లచెర్వు, జల్లెపల్లి, పాతర్లపాడు, పిండిప్రోలు తదితర గ్రామాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి. మండలంలో చాలా గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. పత్తి మిరప పంటలలో నీళ్లు నిలిచి ఉన్నాయి.
సుబ్లేడు చెరువును సందర్శించిన జాయింట్ కలెక్టర్
మండలంలోని సుబ్లేడు గ్రామం ముత్యాలమ్మ కుంట ఉధృతంగా రోడ్డుపై ప్రవహిస్తోంది. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ మధుసూదన్ మంగళవారం సుబ్లేడు గ్రామాన్ని సందర్శించి రోడ్డు మరమ్మతులు చేయించారు. భారీ వర్షాల పట్ల అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ తోపాటు ఇరిగేషన్ ఎస్ఈ శంకర్ నాయక్, డీఈ బాణాల రమేష్ రెడ్డి, ఏఈ రామకృష్ణ, మండల తహశీల్దార్ కోట రవికుమార్, ఎంపీడీఓ జయరామ్ నాయక్, సర్పంచులు పోలేపొంగు సంజీవయ్య, బొబ్బిలి భరత్ చంద్ర, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ క్రిష్ణ, ఆర్బీ అధికారులు, గ్రామస్తులు పాల వెంకన్న పాల్గొన్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు
ఖమ్మంరూరల్ : ఖమ్మం జిల్లాతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, ఆకేరు ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు, ఆకేరు ఉపనదులు మంగళవారం ఉగ్రరూపం దాల్చాయి. చెక్ డ్యాంలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. గోళ్లపాడు, తీర్థాల రహదారి మార్గంలో ఉన్న వంతెనకు సమాంతరంగా ఆకేరు ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరుపై ఉన్న చెక్ డ్యాం వద్ద జలకళ సంతరించుకుంది. మున్నేరు, ఆకేరు ఉపనదుల పరిసర ప్రాంతాలకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సమీప ప్రాంతాల ప్రజలకు, జాలర్లకు హెచ్చరికలు జారీ చేశారు.