Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పున:ప్రారంభానికి సిద్ధమవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో శానిటైజేషన్, పారిశుధ్యం, వాటర్ ట్యాంకుల శుభ్రం, మూత్రశాలల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించింది. వీటి బాధ్యతలను మున్సి పాల్టీలు, పంచాయతీలకు అప్పగించింది. ఈమేరకు ఆయా పాఠశాలల్లో ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. పాఠశాలలు లేకపోవడంతో పలుచోట్ల తరగతి గదులు దెబ్బతిన్నాయి. కొన్ని స్కూల్స్ ప్రహరీగోడలు కూలాయి. మూత్రశాలలు శిథిలమయ్యాయి. బెంచీలు, బల్లలు విరిగిపోయాయి. పక్కా బిల్డింగ్లు లేని పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. పలు పాఠశాలలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికయ్యాయి. మందుబాబులు స్కూల్ ఆవరణలో తాగి సీసాలను అక్కడే వదిలివెళ్లారు. వీటన్నింటినీ పాఠశాల సిబ్బంది పర్యవేక్షణలో పారిశుధ్య సిబ్బంది తొలగించారు. చెత్తాచెదారం పిచ్చిమొక్కలతో కూడిన మైదానాలను శుభ్రం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో కొన్ని నేడు తెరుచుకునేలా లేవు. బడ్జెట్ పాఠశాలలు కొన్ని పూర్తిగా మూతబడే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థి కచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన ఉంది. ఖమ్మం జిల్లాలో 1837 అంగన్వాడీ కేంద్రాలను కూడా నేడు తెరుస్తారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర కమిషనర్ డి.దివ్య ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలను తోరణాలతో అలంకరించారు. పిల్లలకు తొలిరోజు పాయసం వండిపెట్టనున్నారు.
విద్యాసంస్థలు, విద్యార్థుల వివరాలు...
ఖమ్మం జిల్లాలో వివిధ యాజమాన్యాల పాఠశాలలు మొత్తం 1,629 ఉన్నాయి. వీటిలో 1,93,967 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1,837 అంగన్వాడీ కేంద్రాల్లో 69,064 మంది పిల్లలున్నారు. 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 6,353 మంది, 58 ప్రైవేట్ కాలేజీల్లో 17,971, 45 అనుబంధ కాలేజీల్లో 4,751, ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 8,500, 27 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 15,400, ఐదు ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,733 పాఠశాలల్లో 1,57,067 మంది విద్యార్థులున్నారు. 50వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్నారు.
- వీరికి ఆన్లైనే...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మినీ గురుకులంలో 180, తొమ్మిది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 3051, తొమ్మిది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 3,540, ఆరు మైనార్టీ గురుకులాలో 1,211, ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో 341 మంది విద్యార్థులున్నారు. 8,323 మంది విద్యార్థులకు ఆన్లైన్లోనే బోధన కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 1 అర్బన్ గురుకులంలో 100, 13 ఆశ్రమ పాఠశాలల్లో 1,503, రెండు టీఎస్ఆర్ఈఐ సొసైటీ స్కూల్స్ 697, పన్నెండు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 4,677, ఐదు ట్రైబల్ రెసిడెన్షియల్స్లో 1,291, పద్నాలుగు కసూర్బా స్కూల్స్లో 2,445 మందికి ఆన్లైన్లోనే బోధన కొనసాగనుంది.