Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
బహుముఖ ప్రజ్ఞాశాలి, చింతలపూడి వెంకటేశ్వర్లు, చిత్రకారునిగా, శిల్పిగా, కవిగా, రచయితగా, విద్యార్థుల గుండెల్లో ఒదిగిపోయిన ఉత్తమ ఉపాధ్యాయునిగా, సాహితీ సంస్థ నిర్వాహకునిగా..., బహుముఖీనమైన సేవలందించన క్రీస్తు శేషులు చింతలపూడి వెంకటేశ్వర్లు (డ్రాయింగ్ మాస్టర్ ) చిరస్మరణీయుడని గౌతమి నవ్య సాహితీ పేర్కొంది. ఆయన అస్వస్థతతో ఆగష్టు 30, 2021న ఆయన జన్మస్థలం ప్రకాశం జిల్లా ఇడుపులపాడులో తుది శ్వాస విడిచారు. ఆయన 01 జులై 1945న ఇడుపులపాడులో ''చింతలపూడి వెంకట సుబ్బయ్య- సుబ్బాయమ్మ'' దంపతులకు జన్మించారు. ఆయన, విశ్వవిద్యాలయ విద్య అనంతరం తనకు ఇష్టమైన చిత్రకళపై పరిశోధనకు గాను కాశీలోని బెనారస్ విశ్వవిద్యాలయం వెళ్లి, ''తెలుగు సాహిత్యంపై రూప కళాప్రభావం'' అనే అంశంపై పరిశోధన చేశారు.
నాటి ఖమ్మం జిల్లా చర్ల వద్దగల సత్యనారాయణపురం సీతారామ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ''చిత్రకళ ఉపాధ్యాయుడి''గా తన ఉద్యోగ కాలమంతా సేవలు అందించారు. చిత్రకళ తోపాటు, విద్యార్థులకు, తనతోటి ఉపాధ్యాయులకు, తెలుగు సాహిత్యం పట్ల, కవిత్వం పట్ల, మక్కువ పెంచే అనేక కార్యక్రమాలు చేసారు. చర్ల గౌతమి నవ్య సాహితీ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం తన సేవలు అందించారు. డాక్టర్ చింతలపూడి కలం నుండి పద్మావతి పరిణయం సంగీత రూపకం (1979), అమృత వర్షిని కవితా సంపుటి (1981), విజయ గీత పద్య కవితా సంపుటి (1982), అర్థశతి శతకం(2004), శ్రీకన్యకా పరమేశ్వరి చరిత్ర(2014) వెలువడ్డాయి. వీరి సంపాదకత్వంలో ఖాదర్ బాబా వారి దివ్య చరిత్ర, నవ స్వరాలు (కవితా సంకలనం), చైతన్య భారతి, (పద్య కవితసంకలనం) వెలువడ్డాయి. ఈయన రాసిన ఏకైక నాటకం శ్రీ షిరిడి సాయి బాబా మహత్యం, అనేక రచనలకు పరోక్ష రచనా సహకారం అందించిన డాక్టర్ చింతలపూడి, తనదైన నిష్పక్షపాత ధోరణితో తెలుగు సాహిత్యానికి దారి దీపంగా వెలుగొందారు'. ఈరోజు సివికె రావు స్వగృహమునందు సంతాప సభ నిర్వహించనున్నట్లు గౌతమి నవ్య సాహితీ నిర్వాహకులు చింత్తూరి వెంకట్రావు తెలిపారు.