Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
అ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్
భద్రాచలం : మారుమూల ప్రాంతాలున్న ఈ జిల్లాలో ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. గురువారం రాత్రి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చోంగు, సీఎంఓ ఓఎస్టీ ప్రియాంక వర్గీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణలతో కలిసి భద్రాచలంలోని క్షయ నివారణ కేంద్రాన్ని, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజలు పౌష్టికాహార లోపం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, వీరి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని చెప్పారు. భద్రాచలం ఆసుపత్రి నందు పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా న్యూటిషన్ వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పౌష్టికాహారలోపంతో బాదపడుతున్న చిన్నారులతో పాటు తల్లులను కూడా ఆసుపత్రిలో ఉంచనున్నట్లు చెప్పారు. భద్రాచలం పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వైద్య సేవలకు ఆసుపత్రికి వస్తున్నందున ప్రజలకు వైద్య సేవలు అందచేస్తున్నందున ఆరోగ్య శాఖ కమిషనర్ సిబ్బందిని అభినందించారు. క్షయ వ్యాధిగ్రస్తుల నమోదు వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో నలుగురు చిన్నారులున్నారని, వీరిని ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు దత్తత ఇవ్వనున్నట్లు చెప్పారు. దత్తత ఇచ్చిన చిన్నారులను మహిళా శిశు సంక్షేమ అధికారులు ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. అన్ని సౌకర్యాలతో భవనం ఏర్పాటు చేయుటకు ప్రత్యేక కృషి చేసిన కలెక్టర్ అనుదీప్‌ను, ఐటీడీఏ పీఓ గౌతంను అభినందించారు. చాలా మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. శిశు గృహంలో సౌకర్యాలు పర్యవేక్షణతో పాటు చిన్నారుల ఆలనా పాలనా పర్యవేక్షణకు మేనేజర్ స్థాయి అధికారి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్, పీఓ గౌతమ్, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేశి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా నాయకపోడు ప్రజలు తయారు చేసిన చెక్క బొమ్మలను పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా ఈ బొమ్మలను ప్రముఖ జాతర్లులో విక్రయాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని తద్వారా వారికి ఆదాయం సమకూరే అవకాశం కలుగుతుందని చెప్పారు.