Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని తునికిబండల గ్రామానికి చెందిన నిరుపేద రైతు ఈసం దూలయ్య ఆరోగ్య, కుటుంబం ఆర్థిక సమస్యలతో దూలయ్య కుటుంబం సతమతమవుతోంది. గతంలో కరోనా, బ్లాక్ ఫంగస్ రోగాలకు అప్పు చేసి రూ.లక్ష వరకు వైద్యం చేయించుకోగా, ప్రస్తుతం మెదడులో గడ్డ అయ్యిందని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఎక్కడ అప్పు చేసి వైద్యం చేయించుకోవాలని వాపోతున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 8వ తేదీన ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు దూలయ్యను జూన్ 11వ తేదీన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జూన్ 16 బ్లాక్ ఫంగస్ దూలయ్యకు వచ్చినట్టు పరీక్షలు నిర్వహించి నిర్ధారించిన విషయం విదితమే. కాగా మెరుగైన వైద్యం కోసం దూలయ్యను అతని భార్య చంద్రకళ (35), కూతురు శ్రీలేఖ (14) హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గతంలోనే షుగర్ పేషెంట్ అయిన దూలయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించగా రక్తం తక్కువగా ఉందని చెప్పారు. దీంతో అతని కంటి ఆపరేషన్ చేయడంలో ఆలస్యమైందని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెప్పారన్నారు. దీంతో కొన్ని రోజులు పాటు రక్తం ఎక్కించి, షుగర్ వ్యాధి నియంత్రణలోకి రాగా జూలై 16 కంటి ఆపరేషన్ చేసి కుడి కన్నును పూర్తిగా తొలగించారు. కంటి ఆపరేషన్ అనంతరం కొన్ని రోజుల తర్వాత ఆగస్టు 16వ తేదీన స్కానింగ్ చేయించగా మెదడులో గడ్డ ఉందని వైద్యులు తెలిపారు. దీనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. దీంతో ఎటూ తేల్చుకోలేక ఇప్పటికే ఆసుపత్రికి వచ్చి సుమారు రెండున్నర నెలలు గడిచిందని, తెచ్చిన డబ్బులు అయిపోయాయని, ఊరికి వెళ్లి ఖర్చులకు డబ్బులు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఇంటి వద్ద ఉన్న నా కుమారుడు ఆశిష్ తేజ (11)ను చూడాలని ఉందని తండ్రి దూలయ్య చెప్పడంతో రెండు వారాలకు మందులు ఇచ్చి వెంటనే తిరిగి దూలయ్యను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యులు సూచించి ఆగస్టు 27వ తేదీన పంపారు. గతేడాది జూలై 4వ తేదీన తన కూతురు శ్రీలేఖ (14) ట్రాక్టర్ ప్రమాదానికి గురికాగా చికిత్స కోసం రూ.రెండు లక్షల అప్పు చేశామని, ఇప్పుడు తనకు వైద్యం కోసం రూ.లక్ష పైగా అప్పు చేశామని, 77 రోజులపాటు నేను, నా భార్య, కూతురు ఆసుపత్రిలోనే ఉండడంతో ఈ ఏడాది వ్యవసాయం చేసే అవకాశం కోల్పోయి వెరసి వడ్డీకి రూ.మూడు లక్షల అప్పు చేసి అప్పుల ఊబిలో కూరుకు పోయామని దూలయ్య, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని కోరుతున్నారు.