Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏ ఒక్కరూ వైద్యసేవలు అందకుండా
ఇబ్బంది పడకూడదు
అ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్
నవతెలంగాణ-కొత్తగూడెం
భావిభారత పౌరులైన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వయస్సుతో పాటు, ఎత్తు, బరువు కలిగి ఉండే విధంగా పౌష్టికాహారం అందించాలని, ఏ ఒక్కరూ వైద్యసేవలు అందకుండా ఇబ్బంది పడకూడదని, పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా అసుపత్రిని సందర్శించారు. ముందుగా గురువారం సుజాతనగర్ మండలం సర్వారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గిరిజన సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోగ్త్, సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, మహిళా శిశుఅభివృద్ధి సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందచేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ఏ ఒక్క చిన్నారి వయస్సుతో పాటు, ఎత్తు, బరువు కలిగి ఉండాలని, తక్కువ బరువు కలిగి ఉండటానికి వీల్లేదని అటువంటి చిన్నారులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రతి విద్యార్థి వివరాలు ఎత్తు, బరువు వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని వారు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఆశా కార్యకర్తల సేవలు అభినందనీయమని చెప్పారు. అనంతరం కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిని సందర్శించి తెలంగాణ డయాగస్టిక్స్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం పాలియేటివ్ కేర్ యూనిట్‌ను సందర్శించి, అందిస్తున్న సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిరాదరణకు గురై అనారోగ్యంతో బాధపడుతున్న అభాగ్యులకు ఈ కేంద్రంలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని, తదుపరి వారు పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారైన తదుపరి డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శిరీష, డాక్టర్ ముక్కంటేశ్వర్ రావు, డాక్టర్ సరళ, డాక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.