Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. టేకులపల్లి, ములకలపల్లి, దమ్మపేట, దుమ్ముగూడెం, చండ్రుగొండ మండలాలలో స్వల్పంగా వర్షపాత నమోదు కాగా, ఇతర మండలాల్లో భారీ వర్షం నమోదయింది. కొత్తగూడెంలో అత్యధికంగా 125.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 500.6 మిల్లీ మీటర్ల వర్షం నమోదయింది. సగటున 29.4 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగూడెంలో ఇలాంటి భారీ వర్షం నమోదు కాలేదని ప్రముఖులు, పట్టణ ప్రముఖులు భావిస్తున్నారు. కుండపోత వర్షం కారణంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలోని నీరు ఇళ్లల్లోకి చేరింది. ఇంట్లో సామాగ్రి బయట నీళ్లల్లో తేలియాడాయి. విద్యానగర్ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులోకి వెళ్లే దారులన్నీ మూసివేసి ఇండ్ల నిర్మాణాలుచేశారు. దీంతో వర్షం నీరు ఇండ్లల్లో చేరింది. పంచాయతీలోని అన్ని ప్రాంతాలు జలమయంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తెల్లవారు జామున కురిసిన వర్షానికి నీరు ఎటుపోయే వీలులేక కాలనీలోని అనేక ఇండ్లల్లోకి చేరింది. అడ్డగోలుగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలవలన అండర్ గ్రౌండ్లలో, స్థానిక ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్‌నగర్, ప్రగతి నగర్, మావిడితోటకాలనీ, బంగరుచెలక పంచాయతీ గొల్లగూడెం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గొల్లగూడెం పాఠశాలలు వెళ్లే మోహన్ ఉపాధ్యాయులు వాగు దాటేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన జాతీయ రహదారిపై మోకాళ్ళ లోతు వరకు నీరు చేరడంతో చెరువును తలపించే రీతిలో కనిపించంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిది. నీటి ప్రవాహం వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్‌లోకి మురుగు నీరు చేరింది. విద్యానగర్ కాలనీ మొత్తం జలదిగ్బంధంలో మునిగిపోయింది. 2005 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలకు విద్యానగర్ కాలనీ జలమయంగా మారిన సంగతి విధితమే. కాగా, ఉదయం కురిసిన వర్షం కారణంగా విద్యానగర్ కాలనీ రోడ్లు, వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరాయి. విషసర్పాలు ఇతర, జంతువులు ఇళ్లల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొత్తగూడెంలో 125.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. మణుగూరులో 64.2, పినపాక 41.2. చర్ల 38.4, అశ్వాపురంలో 24.8, గుండాలలో 17.6, ఇల్లందులో 52.4, పాల్వంచలో 41.2, బూర్గంపాడులో 21.2, భద్రాచలంలో 17.2, ఆశ్వారావుపేట 15.4 మీటర్ల వర్షం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.