Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజ ర్లను నియమించకపోవడంతో పాఠశాలలోని మరుగుదొడ్ల శుభ్రం చేసేదెవరు, పిల్లల ఆలనా పాలనా చూసేది ఎవరనేది ప్రస్తుతం పాఠశాలలో సమస్యగా మారింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ ఏర్పాటు చేసి పాఠశాలను శుభ్రం చేయటం మరుగుదొడ్లు, చిన్న పిల్లల ఆలనాపాలనా చూడటం వంటి పనులు చేస్తూ ఉండేది. 2020 మార్చి నుండి కరోనా రావటంతో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో స్కావెంజర్ పోస్టులు కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయకపోతే పాఠశాలను శుభ్రం చేసేది ఎవరు అని పెద్ద సమస్యగా మారింది. మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, హైస్కూల్స్ మొత్తం 66 ఉన్నాయి. పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే రూ. 2 వేలు, 50కి ఎక్కువ మంది ఉంటే రూ.2500లు వేతనాలు ఇచ్చేవారు. 2020 ఏప్రిల్ నుండి ప్రభుత్వం రద్దు చేసి గ్రామ పంచాయతీలకు శుభ్రం చేసే పని అప్పగించింది. గ్రామ పంచాయతీ సిబ్బంది కొరతతో అసలే ఇబ్బంది పడుతుంటే పాఠశాలను శుభ్రం చేయడం కూడా పంచాయతీలపై పడటంతో వారికి మోయలేని భారంగా మారింది.
పాఠశాలలో పనిచేసే స్కావెం జర్ను కూడా గ్రామపంచాయతీ సహకారంతోనే నియమించుకోవాలని జిల్లా విద్యా శాఖల నుండి మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ విషయంపై స్థానిక గ్రామ పంచాయతీలను ప్రధానోపాధ్యాయులు సంప్రదించగా మాకు ఎలాంటి ఆదేశాల్లేవు, మా పంచాయతీలు నడపడానికి డబ్బులేక మేం ఇబ్బందులు పడుతున్నామని, మా వల్ల కాదు అని సర్పంచులు స్పష్టం చేస్తున్నారు. దీనికితోడు చిన్న గ్రామపంచాయతీల్లో కనీసం విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్కావెంజర్ల నియమించటం గ్రామ పంచాయతీలపై భారం వేయడం తగదని సర్పంచ్లు అంటున్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వమే స్కావెంజర్ల నియమించుకోవాలని సర్పంచులు చేతులెత్తేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్కావెంజర్లు బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ప్రశ్నగా మారింది. ఒక వైపు కరోనాతో తల్లిదండ్రులు భయపడుతుండగా స్కావెంజర్ను పాఠశాల్లో నియమించకపోతే పిల్లల్ని ఎలా పంపిస్తామని తల్లిదండ్రులు అంటున్నారు. వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ల నియమించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.