Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం గ్రామ గ్రామాన జరుగు నిరసనలు, ఆందోళనా పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవనంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం అధ్యక్షతన జరిగిన మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ కారుచౌకగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని, అదే విధంగా రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను పక్కదారి పట్టించే ధోరణిని వ్యతిరేకిస్తూ ఆందోళనా పోరాటాలు నిర్వహించాలని కోరారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు, గిరిజన, పేదలందరికి ఆర్థికంగా ఆదుకునేందుకు దళితబంధు తరహాలో అందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. జెండా పండుగపై వున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన జిల్లా కలెక్టరేట్ మరియు మండల కేంద్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా భారీస్థాయిలో ఆందోళనలు చేపట్టాలని సిపిఎం శ్రేణులను కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటి సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాళ్ళపల్లి కృష్ణ, తూశాకుల లింగయ్య, వై. విక్రం,మోరంపూడి పాండురంగారావు మరియు మండల కార్యదర్శులు పాల్గొన్నారు.