Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
రోజు బడికి చెరువు అలుగుపై నుండి పోవాలంటే భయమేస్తుంది సారూ... అలుగుపై నాచుపాకురు పట్టి ఎక్కడ కాలు జారి నీటిలో పడతామోనని భయంతో బిక్కుబిక్కుమంటూ బడికి పోతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారేపల్లి మండలం గాదెపాడు పెద్దచెరువు (భూపతిరాయుని చెరువు) నిత్యం అలుగు పోస్తుంది. ఈ అలుగు పైనుండి గాదెపాడుకి చెందిన విద్యార్ధులు, గ్రామస్తులు గాంధీనగర్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. గాంధీనగర్‌లో హైస్కూల్‌కు గాదెపాడుకు చెందిన విద్యార్ధులు నిత్యం అలుగు పైనుండే ప్రయాణిస్తుంటారు. అలుగుపై నుండి విద్యార్ధులు చేయిచేయి పట్టుకొని అలుగు దాటి బడికి పోవాల్సిన స్ధితి ఇక్కడ ఉంది. ఈ అలుగు వర్షాకాలం అంతా ప్రవహిస్తునే ఉంటుంది. దీంతో అలుగుపై నడిచే భాగం నాచు, పాకురు పట్టి జారుతూ ఉంటుంది. అలుగు ప్రయాణిస్తూ పట్టుతప్పితే అంతే సంగతులు.... అటు చెరువు అయినా, ఇటు అలుగు క్రింది భాగంలోనైనా పడాల్సిన పరిస్ధితిలో భయంగా భయంగా ప్రయాణించాల్సిన దుస్ధితి.
బ్రిడ్జికి కచ్చా రోడ్ లేక నిరూపయోగం
గాదెపాడు పెద్దచెరువుపై ఎన్ఆర్ఈజీఎస్ క్రింద రూ.50లక్షలతో బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసి నాల్గేండ్లు కావస్తుంది. ఈ బ్రిడ్జీపై నుండి ప్రయాణించాలంటే దానికి ఆనుకొని కచ్చా రోడ్ వేయాల్సి ఉంటుంది. బ్రిడ్జి నిర్మించిన ఆధికారులు కచ్చా రోడ్ వేయటంలో తాత్సర్యం మూలంగా రూ.లక్షలతో కట్టిన బ్రిడ్జి నిరుపయోగంగా మారింది. ఐటీడీఏ అధికారులకు విన్నవిస్తున్నా దానిపై పట్టింపు లేదని గాదెపాడు, గాంధీనగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్రిడ్జిని వాడుకలోకి తేవాలి : సీపీఐ(ఎం)
రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన బ్రిడ్జిని వెంటనే వాడుకలోకి తేవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రహదారి వెంట 15 గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారన్నారు. విద్యార్ధులు తప్పని సరిగా నిత్యం ఈ అలుగుపైనుండి పోవాల్సి వస్తుందన్నారు. బ్రిడ్జీకి ఆనుకొని రోడ్డు లేక పోవటంతో ప్రయాణం ప్రమాధభరితంగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేనిచో రెండు గ్రామాల ప్రజలను సమీకరించి అందోళన చేస్తామని హెచ్చరించారు.