Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సీఐటియూ)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో కరోనా, మైన్ ప్రమాదాలలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు కోల్ ఇండియా సర్య్కూలర్, గతంలో డైరెక్టర్ (పా) ఇచ్చిన హామీ మేరకు తక్షణం రూ.15 లక్షలు ప్రత్యేక ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కరోనాతో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం కార్పొరేట్లోనే కరోనాతో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు మరణించారని తెలిపారు. సింగరేణి వ్యాపితంగా సుమారు 15 మంది కరోనాతో మృతి చెందినట్లు తెలిపారు. కరోనా మరణాన్ని కూడా మైన్ యాక్సిడెంట్‌గా పరిగణించి మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు ప్రత్యేక ఎక్స్ గ్రేషియో చెల్లించాలని కోలిండియా సర్క్యులర్ జారి చేసింది. దీనిని కోలిండియాలో అధికారులు, పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేస్తూ రూ.15 లక్షలు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. అదే సర్క్యులర్‌ను ఇక్కడ అమలు చేస్తున్న సింగరేణి యాజమాన్యం అధికారులకు, పర్మినెంట్ కార్మికులకు రూ.15లక్షలు చెల్లిస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించక పోవడం దుర్మార్గమన్నారు.
అధికారులు, పర్మినెంట్ కార్మికులే మనుషులు, వారివే కుటుంబాలు కాంట్రాక్ట్ కార్మికులు మనుషులు కాదా.....? అని ప్రశ్నించారు. వారివి కుటుంబాలు కావా....?అని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇంటివల మణుగూరులో సింగరేణి నిర్లక్ష్యం ఫలితంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు పర్మినెంట్ కార్మికులతో పాటు వి.చిన్నవెంకన్న అనే కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడన్నారు. పర్మినెంట్ కార్మికులకు ప్రత్యేక ఎక్స్ గ్రేషియో రూ.15లు చెల్లించింది. కానీ, కాంట్రాక్ట్ డ్రైవర్‌కు మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దహన సంస్కారాల నిమిత్తం ఖర్చులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పిన అధికారులు రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపు కోవడం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్య తీరుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో గత సంవత్సర కాలంలో గని ప్రమాదాలలో సుమారు 11 మంది కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారని చెప్పారు. వీరి కుటుంబాలను ఆదుకోవడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
ఇటీవల 2021 జులై 17న జరిగిన జెబిసిసిఐ సమావేశంలో అన్ని కార్మిక సంఘాలు ఈ అంశాన్ని లేవనెత్తగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ.15 లక్షలు చెల్లిస్తామని ఆసమావేశంలో పాల్గొన్న సింగరేణి డైరెక్టర్ (పా) హామి ఇచ్చారని కానీ, నేటికి అమలు చేయక పోవడం శోచనీయమన్నారు.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్షతను వీడి కరోనా, గని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు తక్షణం రూ.15 లక్షలు ప్రత్యేక ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు నష్టపరిహారాన్ని చెల్లించేందుకు సింగరేణి వ్యాప్తంగా ఒక విధానాన్ని ప్రకటించాలని, రూ.50 లక్షలు తగ్గకుండా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులను, మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియూ) కొత్తగూడెం బ్రాంచ్ నాయకులు సూరం ఐలయ్య, కిషోర్, భాస్కర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.