Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
ప్రభుత్వ పాఠశాలను మూసివేసేందుకు ప్రభుత్వం పాఠశాలలో స్లీపర్ పోస్టులను రద్దు చేసి గ్రామ పంచాయతీల మల్టీపర్పస్ వర్కర్లను పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయాలని నిర్ణయించిందని మండల ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శని వారం జరిగింది. ఈ సమావేశంలో మండల విద్యాశాఖాధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాట్లా డుతుండగా సర్పంచులు మర్రి తిరుపతిరావు, బుక్యా సైదా నాయక్, కేతినేని ఇందు, ఎంపీటీసీలు జొన్నలగడ్డ సునీత, కందిమల్ల రాధ తదితరులు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయటానికి నిరాకరిస్తున్నారని, బలవంతంగా వారిచే పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయించలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో పోస్టులను ఎందుకు రద్దు చేసిందని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం పోస్టులను రద్దు చేసిందన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్బూరి శరత్ బాబు మాట్లాడుతు చాలా మంది రైతులు రైతు బీమా చేయించుకోలేదని అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే వివరాలను మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ సంగు శ్వేతా మాట్లాడుతుండగా గోవిందా పురం సర్పంచ్ భాగం శ్రీనివాసరావు గ్రామంలోని దళిత కాలనీలో వ్యవసాయ పొలాలకు సంబంధించిన వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందిగా ఉందని, సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. సర్వేరు రాగానే వెంటనే సర్వే చేసి తగిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త కార్డుల పేరుతో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఎంతో హడావుడి చేశారని, కానీ నేటి వరకు గ్రామపంచాయతీలకు రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి లిస్టు తమకు అందజేయలేదు అని ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డులు నేటి వరకు ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీయడంతో డిప్యూటీ తాసిల్దారు మీ సేవా కేంద్రాలలో డౌన్లోడ్ చేసుకోవాలని తాసిల్దార్ కార్యాలయం నుంచి ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. కొత్తగా రేషన్ కార్డుల లో పిల్లలు పేర్లు చేర్చడానికి వీలు పడటం లేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పొలాల నుంచి రోడ్లు, పైపులైన్లు, కాలువలు వెళ్ళితే ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్లో ఎలా పెడతారు అని నిలదీశారు. అటువంటి సమస్యలు తమ దష్టికి వస్తే వెంటనే కలెక్టర్ కు పంపిస్తున్నామని సాధ్యమైనంత తొందరగానే పరిష్కారం చేస్తున్నామని డిప్యూటీ తాసిల్దారు తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చిన ఒకరోజు తరువాత గాబు లలో ఆ నీళ్ల నుంచి పురుగులు వస్తున్నాయని అటువంటి నీళ్లు ఎలా తాగాలి, ఎలా వినియోగించుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ ఎర్ర శ్రీనివాసరావుని పలువురు ప్రజా ప్రతినిధులు నిలదీశారు. గ్రామాలలో విద్యుత్ సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం కాక అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని, ప్రతి గ్రామానికి ఒక హెల్పర్ ని ఏర్పాటు చేస్తేనే విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందని లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షుడు మాది నేని వీరభద్రరావు విద్యుత్ నాగేశ్వరరావు దష్టికి తీసుకెళ్లారు. ఇక పలు శాఖలపై మొక్కుబడిగా చర్చ జరిగింది ఈ సమావేశంలో ఎంపిడిఓ గొట్టిపాటి శ్రీదేవి, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు.