Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కూలీ పనులకు వెళ్లి వస్తుండగా
యేడేండ్ల క్రితం రోడ్డు ప్రమాదం
అ ఎడమ కాలు కోల్పోయిన శ్రీను
అ దాతల సహాయం కోసం ఎదురు చూపు
అ కృత్రిమ కాలు ఏర్పాటు కోసం ముందుకు
వచ్చిన స్ఫూర్తి ఫౌండేషన్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన ఎర్ర బోరు గ్రామానికి చెందిన తాటి శ్రీను అనే 27 యేండ్ల గిరిజన యువకుడు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 2011లో పదవతరగతి పూర్తి చేసిన శ్రీను ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో వ్యవశాయ పనులకు వెళ్లే వాడు. ఆ క్రమంలో 2014 సంవత్సరంలో శ్రీను గ్రామానికి చెందిన వ్యవశాయ కూలీలతో కలసి ట్రాక్టర్‌పై మిరప కాయల కోతకు సీతారాంపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆర్లగూడెం వద్ద ట్రాక్టర్ ప్రమాద వశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొంత మంది వ్యవశాయ కూలీలు సైతం గాయాలు పాలు కావడంతో పాటు శ్రీను ఎడమ కాలు పూర్తిగా విరిగి పోయింది. ఆ సమయంలో వ్యవశాయ పనుల కోసం తీసుకు వెళ్లిన రైతు వైద్యం అందించినప్పటికీ శ్రీను ఎడమ కాలుకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి తొడ భాగం వరకు తొలగించారు.
దాతల సహాయం కోసం ఎదురు చూపు : ఉన్నత చదువులు చదువుకునే స్థోమత లేక వ్యవశాయ పనులకు వెళుతున్న తాటి శ్రీనును విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన అతనికి కృత్రిమ కాలు అమరిస్తే రూ.2 లక్షల ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో చేసేది లేక సంకలో కర్రల సహాయంతో ఇంటికే పరిమితం అయ్యాడు. తనను ఆర్ధిక పరిస్థితులు బాగా కుంగ దీశాయని, ప్రోత్సహించే వారు సైతం లేక తాను ముందుకు వెళ్ల లేక పోయానని నవతెలంగాణతో వాపోయాడు. పదవతరగతి వరకు చదువుకున్న తనకు ఎదైనా ప్రభుత్వ కార్యాలయంలో చిన్నపాటి ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఒక్క కాలుపై తన బతుకు తాను బతకడంతో పాటు కన్న తల్లి దండ్రులకు తోడుగా ఉంటానని అధికారులు తన పట్ల దయా హృదయం చాటాలని శ్రీను వేడుకుంటున్నాడు. కృత్రిమ కాలు కోసం సహాయం చేసే దాతలు తాటి శ్రీను 8978943415 అనే ఫోన్ పే నెంబర్‌కు తమకు తోచిన సహాయం అందించాలని కోరుతున్నారు.
కృత్రిమ కాలు ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్ఫూర్తి ఫౌండేషన్ :
చర్ల మండల కేంద్రంగా గత 20 యేండ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ నిర్వహకులు తాటి శ్రీను కృత్రిమ కాలు ఏర్పాటు కోసం ముందుకు వచ్చారు. చర్ల మండలానికి చెందిన శ్రీను దగ్గర బందువు, బిఎస్పి నాయకుడు పూనెం ముఖేష్ ద్వారా ద్వారా విషయం తెలుసుకున్న స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్.క్రిష్ణార్జునరావు శ్రీనుకు కృత్రిమ కాలుకు ఏర్పాటు కోసం తన వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. స్నేహితుల సహకారంతో రెండు, మూడు నెలల్లో కృత్రిమ కాలు అమర్చి ఆ గిరిజన యువకుడు తన కాళ్ల మీద తను నిలబడే విధంగా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు.