Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ శాఖ నిర్లక్ష్యమే విద్యార్థులకు మంచినీటి కొరత
- అధికారుల పర్యవేక్షణ లోపంతోనే పైపుల లీకేజీ
నవతెలంగాణ-టేకులపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలలో మంచి నీటి పంపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఆర్డబ్ల్యుఎస్ శాఖ అధికారులు మాత్రం పాటించడం లేదని పలు గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 36 గ్రామ పంచాయతీలలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 58, యూపీఎస్ 13, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 6, గిరిజన వెల్ఫేర్ పాఠశాలలు 10, జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు 6, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కలవు. వీటిలో సుమారు 7 వేలమంది విద్యార్థిని, విద్యార్థులు విద్య నభ్యసించుటకు పాఠశాలలకు వెళుతున్నారు. మండల పరిధిలోని అనేక పాఠశాలల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి నీటి పంపులను మాత్రము సంబంధిత కాంట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాలకు మంచినీటి పంపు కలెక్షన్ ఇవ్వట్లేదని పలు గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పైపులైను పాఠశాలలకు ఇవ్వకపోవడంపై వివక్షత ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ గ్రామాలలో పైపులు వేసిన కొద్దిరోజులకే లీక్ అవుతున్నాయి. తాత్కాలికంగా మరమ్మతులు చేపడతు న్నారు. శాశ్వత మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రులు అంటున్నారు. పర్యవేక్షణ చేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం చూచి చూడనట్టు వ్యవహరి స్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిలో రోడ్డుకిరు వైపులా మిషన్ భగీరథ ఇంటింటి పైపుల కోసం తీసిన గోతులను సరిగా చదును చేయకపోవడం వల్ల వాహనదారులు కింద పడ్డ సంఘనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం విడనాడి పాఠశాలలను గుర్తించి, పైపులైను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి నీటి కొరత లేకుండా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పర్యవేక్షణ చేసిన రోజే గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి పనులు సక్రమంగా ఉంటాయని మండల వాసులు వాపోతున్నారు.