Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు మోక్షము రానున్నది. త్వరలో బైపాస్ రోడ్డు పనులన్నీ పూర్తి కానున్నాయని తెలుస్తుంది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్న బైపాస్ రోడ్డు గత కొన్ని సంవత్సరాల క్రితం వివిధ కారణాల రిత్యా నిలిచిపోయింది. అసంపూర్తిగా పనులు నిలిచిపోవడంతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఎట్టకేలకు బైపాస్ రోడ్డు పనులకు మోక్షం వచ్చింది. రోడ్డు భవనాల శాఖ అధికారులు గతంలో పెండింగ్లో ఉన్న పనులను ఒక్కటోక్కడిగా చేస్తున్న తీరుతో గూడెం ప్రజల్లో ఆశలు పెరిగాయి.
చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ శివారులోని హౌసింగ్ బోర్డు నుండి బైపాస్ రోడ్డు రామవరం జాతీయ రహదారి మీదుగా మున్సిపల్ పరిధిలోని పాత కొత్తగూడెం, చాతకొండ పంచాయతీ పరిధిలోని సాటి వారి గూడెం నుండి పాల్వంచ మండలం ఎర్రగుంట, జగ్గుతండా మీదుగా నవభారత్ ఎదురు గల జాతీయ రహదారికి లింకుగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అనేక కారణాల రిత్య బైపాస్ రోడ్డు మధ్యలో నిలిచి పోయింది. చుంచుపల్లి మండలం, పాల్వంచ మండలంలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో రైతుల నుండి భూ సమస్య రావడంతో రోడ్డు అభివృద్ధి చతికిల పడింది. ఆర్అండ్బి అధికారులు ఇటీవలే పాల్వంచ మండలంలోని రైతుల భూ సమస్యను అధిగ మించారు. సమస్య తొలిగి పోవడంతో ఎరగ్రుంట, జగ్గు తండా, నవభారత్ మధ్య ఉన్న చెరువు కట్ట పైన రోడ్డు విస్తరణ పనులు, డ్రైన్స్ నిర్మాణాలు వేగవంతం చేశారు. బీటి పనులు పూర్తి చేస్తే వాహన దారులు రద్దీపెరిగి, రయ్యి మంటు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏండ్లు గడుస్తున్నా పూర్తికాలేదు....
2014 కొత్తగూడెం-పాల్వంచ బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగూడెం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఇది ముఖ్యమైనది రహదారిగా భావించి బైపాస్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. రోడ్డు ప్రారంభం నుండి అనేక అడ్డంకులు తలెత్తాయి. సమయం పెరిగిన కొద్ది నిర్మాణ వ్యయం పరిగింది. గుత్తెదారులకు బిల్లులు రాకపోవడం సమస్యగా మారింది. బైపాస్ పెండింగ్ సమస్యగా మారింది. 1996లోనే కొత్తగూడెం నుండి పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, చత్తీస్ఘడ్, ఒడిస్సా ఇతర ప్రాంతాలకు భారీ వాహనాల ద్వారా సరుకు రవాణా చేసేందుకు సులువుగా ఉంటుందని అధికారులు భావించారు. ప్రభుత్వానికి నివేదికలు అందించారు. కానీ ముందుకు సాగలేదు. కొత్తగూడెం పట్టణం నుండి భారీ వాహనాలు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు, వాయు కాలుష్యం ఏర్పడుతుందని భావించి 2014లో ప్రభుత్వం బైపాస్కు శ్రీకారం చుట్టారు. నిర్మాణం అధిక భారంగా మారింది.
పనులు నత్తనడకన సాగాయి. ఇప్పటికే భారీ వాహనాలు కొత్తగూడెం, హేమ చంద్ర పురం, కారుకొండ, బొమ్మనపల్లి మీదుగా భారీ వాహనాలను మళ్లీస్తున్నారు. ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డు మోసం వస్తే కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లి మండలం మీదుగా పాల్వంచ నవభారత్ వరకు సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. బైపాస్ రోడ్డుకు మోక్షం లభిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
అధికారుల చొరవతో మోక్షం వచ్చినట్లు....!.
కొత్తగూడెం-పాల్వంచ మధ్య సుమారు 10.96 కిలోమీటర్లు బైపాస్ రోడ్ ఏర్పాటు చేయాలి. రోడ్డు నిర్మాణానికి ఆదినుండి విఘ్నాలు కలిగాయి. ప్రస్తుతం విద్యానగర్ కాలనీ ప్రాంతం నుండి రామవరం జాతీయ రహదారికి 2.6 కిలోమీటర్లు నేరుగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఫైనల్ బీటీ వేయనున్నారు. గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వందల కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంగా మారింది. ఏకంగా గోధుమ వాగు బిడ్జ్రి నుండి పాత కొత్తగూడెం వరకు గల సుమారు 2 కిలోమీటర్లు ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపారు. అధిక వ్యయం కావడంతో ప్రాజెక్టు అటకెక్కింది. నెమ్మదిగా పనులు పాత కొత్తగూడెం శివారు నుండి చాతకొండ పంచాయతీ, సాటివారి గూడెం. వరకు ఇప్పటికే రోడ్డు పనులు చేశారు. అంచెలంచలుగా పూర్తయితే ప్రస్తుతం ఉన్న కష్టాలు తొలగిపోయే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, ఎన్టీపీఎస్, బిటీపిఎస్, ఐటిసీ, నవభారత్, ఇరత పరిశ్రమలకు నిత్యం వచ్చే భారీ వాహనాలు బైపాస్ మీదుగా వెళ్లేఅవకాశం ఏర్పడితే గూడెం ప్రజలు భారీ వాహనా రణగొన ధ్వనుల నుండి మోక్షం లభిస్తుంది. వీటితోపాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణించే సామాన్య ప్రజానీకానికి ఈ బైపాస్ రోడ్డు మార్గం ద్వారా సునాయాసంగా తక్కువ సమయంలో గమ్యస్థానంకు వెళ్లే అవకాశం కలుగుతుంది.