Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి జవ్వాజి
3వ వర్థంతి సభలో జాతీయ కన్వీనర్
లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఉపెందర్
నవతెలంగాణ-గుండాల
కొమరం భీమ్ జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆదివాసీల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి జవ్వాజి లక్ష్మినారాయణ ఆశయాలను ముందుకు తీసుకు పోవాలని తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమనాల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపెందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు పూనెం బాలక్రిష్ణ, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతరాములు, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఈసం శంకర్, పీవైఎల్ జిల్లా నాయకులు వాంకుడోత్ అజరు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జవ్వాజి లక్ష్మినారాయణ 3వ వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ ముద్దుబిడ్డ జవ్వాజి లక్ష్మినారాయణ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదిలాబాద్ నుండి భద్రాచలం, శ్రీకాకుళం ఏజన్సీలోని ఆదివాసీలను చైతన్య పరిచి ఆదివాసీల హక్కులు, చట్టాల అమలు కోసం పని చేశారని గుర్తు చేశారు. ఆదివాసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. హరితహారం పేరుతో ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కుని ఆదివాసీలను అడవులకు దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నదని, ఆదివాసీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ సమాజం మొత్తం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో జవ్వాజి సతీమణి పద్మ, కుటుంబ సభ్యులు, తుడుందెబ్బ జిల్లా నాయకులు పూనెం శ్రీను, వజ్జ ఎర్రయ్య, జవ్వాజి పాటల రచయిత, నిర్మాత వట్టం కన్నయ్య, మండల నాయకులు గోవింద నర్సింహారావు, మోకాళ్ళ కన్నయ్య, ఈసం సాంబయ్య, కల్తి వసంతరావు, మోకాళ్ళ మహెం దర్, వెంకట్, గుండాల ఉప సర్పంచ్ ఉపెందర్, పీవైఎల్ జిల్లా నాయకులు పర్శిక రవి, ఎన్డీ నాయకులు నరేష్, గడ్డం లాలయ్య, జగన్, అజ్గర్, సాయనపల్లి సర్పంచ్ లక్ష్మినర్సు, గ్రామస్తులు పాల్గొన్నారు.