Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు పరిహారం అందించడంలో సత్వర చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం టి.టి.డి.సి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలీసు కమీషనర్ విష్ణు. యస్. వారియర్ కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కార చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 72 కేసులు విచారణ దశలో ఉన్నాయని, వీటిపై సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కేసుల విచారణకు సంబంధించి సంబంధిత శాఖల నుండి అవసరమైన డాక్యుమెంట్ల సేకరణలో జాప్యాన్ని నివారించాలని, కోర్టు పెండింగ్ కేసులకు సంబంధించి వెనువెంటనే కౌంటర్ దాఖలు చేసి పరిష్కార దిశగా చర్యలు చేపట్టి బాధితులకు పరిహారం అందించేందుకు కషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 606 మంది బాధితులకు 6 కోట్ల 41 లక్షల పరిహారాన్ని అందించడం జరిగిందని, పెండింగ్ కేసులపై సత్వర తీసుకొని బాధితులకు పరిహారం అందేలా అనుబంధ శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి త్రైమాసికానికి తప్పనిసరిగా నిర్వహించాలని పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. ఖమ్మం టౌన్ డివిజన్లో 15 కేసులు, ఖమ్మం రూరల్ డివిజన్లో 13 కేసులు, వైరా డివిజన్లో 32 కేసులు, కల్లూరు డివిజన్ లో 12 కేసులు విచారణ దశలో ఉన్నాయని వీటిపై పోలీసు అధికారులు కేసుల పరిష్కారానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను సంబంధిత శాఖాధికారుల నుండి సత్వరమే పొంది కేసుల పరిష్కార స్వభావాన్ని చూపి బాధితులకు న్యాయం చేకూర్చేలా సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఏ.ఎస్.పి స్నేహ మెహరా, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, ఏసిపిలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి. వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు వీరభద్రయ్య, దాస్ మహరాజ్, అంజయ్య మాదిగ, టి.జి. రామారావు, సంబంధిత అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.