Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చుంచుపల్లి-లక్ష్మిదేవిపల్లి మండలాలు జలమయం
అ వర్షానికి కూలిన ఇల్లు...తప్పిన ప్రమాదం
అ బిక్కు బిక్కు మంటున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు
అ మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి ప్రాంతాలలో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వీధుల్లో ఉన్న మురుగు నీరు ఇండ్లల్లోకి చేరింది. చుంచుపల్లి రాంనగర్లోని బొంకూరి శంకర్ ఇల్లు ఒక్కసారిగా కూలింది. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో 174 మిల్లీ మీటర్ల వర్షం పడింది. చుంచుపల్లిలో 162.3, లక్ష్మీదేవిపల్లిలో 148 మిల్లి మీటర్ల వర్షం నమోదు అయింది. భారీగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సింగరేణి ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ప్రశాంతినగర్ పంచాయతీ పరిధిలో భారీ వర్షాలకు అనేక ఇళ్లు నీటమునిగాయి. కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలో రామవరం ఎస్సీబీ నగర్లో వర్షపు నీరు ఎటు పోలేని పరిస్థితిలో లోతట్టులో ఉన్న ఇండ్లల్లోకి చేరాయి. నాళాలపై అక్రమ నిర్మాణాలు పెరిగిపోవడంతో భారీ వర్షాలు కురిసిన ప్రతి సారి ఇదే దుస్థితి దాపురిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి వెళుతున్నారే తప్పా...సమస్యలకు శాస్వతపరిష్కారం చేయడంలేదు. మున్సిపల్ పరిధిలోని రామవరం, కూలి లైన్, బూడిద గడ్డ, ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి, పట్టణ నడిబొడ్డున ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా వర్షం నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం నుండి భద్రాచలం వైపు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు అండర్ బ్రిడ్జి కింద వరద నీటిలో చిక్కుకుపోయాయి. బస్సులోకి నీరు చేరింది. ప్రయాణికులు బిక్కుబిక్కు మంటు గడిపారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూటీమ్ జోరుగా కురుస్తున్న వర్షంలో అక్కడికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. చుంచుపల్లి, విద్యా నగర్ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి భారీగా చేరింది. ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో చెరువును తలపించే రీతిలో ఇళ్ల చుట్టూ వరదనీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు జెసిబి సహాయంతో నీరు వెళ్లే విధంగా రోడ్లను, కాలువలను పగులకొట్టారు. లక్ష్మీదేవి పల్లి పంచాయతీ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలలో వరద బీభత్సం కనిపించింది. వాగులు, వంకలు పొంగుతున్న నేపద్యంలో మారు మూలన ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రశాంత్ నగర్, చాతకొండ, డ్రైవర్స్ కాలనీ, హమాలి కాలనీలోని ఇళ్లల్లోకి మురుగు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కొత్తగూడెం రామవరం పరిధిలో ఉన్న గోధుమ, ముర్రెడు వాగులు పొంగి పొర్లుతున్నాయి. రానున్న మరో యూడు రోజులు భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురుస్తాయని వతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపద్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ముంపు ప్రాంతాలను సందర్శించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు.