Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజా పోరాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం భారీ వర్షంలో పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను బరితెగించి అమలు జరుపుతుంద న్నారు. వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసేందుకు వ్యవసాయ చట్టాలను, ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థను, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని బలహీనపరుస్తూ ప్రమాదకరమైన 3 నల్ల చట్టాలను ముందుకు తెచ్చిందన్నారు. 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికవర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి పాల్పడుతూ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు దెబ్బతినేలా పరోక్ష కుట్ర చేస్తోందన్నారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సెప్టెంబర్ 6న గ్రామ, వార్డు, కార్పొరేషన్, డివిజన్లో స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే స్థానిక మంచికంటి భవన్ ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమిద్దాం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఎన్నికల హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. ఉమ్మడి జిల్లాకు లక్ష చొప్పున 10 లక్షల బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పని వాగ్దానం ఆమడ దూరంలో ఉంది. హైదరాబాదులో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణమై ఉన్నప్పటికీ అర్హులైన పేదలకు ఇవ్వడం లేదు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా యజమానులకు ఊడిగం చేస్తుంది. దళితులకు 3 ఎకరాల భూమి హామీగానే మిగిలిపోయింది. తక్షణమే టీఆర్ఎస్ తన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జాటోత్ కృష్ణ, కొండపల్లి శ్రీధర్, ప్రజా సంఘాల నాయకులు అన్నవరపు సత్యనారాయణ, యు.నాగేశ్వరరావు, రమేష్, రజిత, విజయలక్ష్మీ, సలీమ్ పాల్గొన్నారు
భద్రాచలం : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, భద్రాచలం పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక, యం.బి.నర్సారెడ్డిలు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం పట్టణ అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో యూడీసీ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు యం.రేణుక, యం.బీ.నరసారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు పి.సంతోష్ కుమార్, డి.సీతాలక్ష్మి, ఎన్.నాగరాజు, శాఖా కార్యదర్శులు సతీష్, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.