Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచలో సోమవారం ఉదయం నుండి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారితోపాటు లోతట్టు ప్రాంతాలన్ని నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 12.8 మిమీ వర్షపాతం నమోదైంది. కుండపోతగా కురిసిన వర్షానికి వచ్చిన వరద ఉధృతికి బాలిక ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోయి మృతిచెందింది. పట్టణంలోని వెంకటేశ్వర హీల్స్, జయమ్మకాలనీ, శివనగర్, దమ్మపేట సెంటర్, సంజరునగర్, మంచికంటినగర్, సోనియా నగర్, కేసిఆర్ నగర్, అయ్యప్పనగర్, గాంధీనగర్, కబీర్తండాలలో డ్రైపేజిలు మునిగిపోయి రోడ్లపైకి ఇళ్లలోకి నీరు చేరుకుని సుమారు 50 గృహాల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లోని విలువైన వస్తువులు టీవీలు ఫ్రిజ్లో గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. చాలాచోట్ల అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయి. సబ్స్టేషన రోడ్డు మసీదు ఎదురుగా ఎన్నడూ లేని విధంగా 6అడుగుల ఎత్తు నీరు చేరుకుని ఇళ్లలోకి నీరు చేరుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దమ్మపేట సెంటర్ నుండి నవభారత్ వరకు వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొర్రేడు వాగు పొంగి బ్రిడ్జిపై నుండి నీరు వెళ్లాయి. పాల్వంచ నుండి ముల్కలపల్లి వెళ్లే దారి రాకపోకలు నిలిచిపోయాయి.
పాల్వంచలో కలెక్టర్ పర్యటన
భారీ వర్షాల కారణంగా వరదలు పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. పట్టణంలోని జయమ్మ కాలనీలో చిన్నారి వరదలో కొట్టుకుపోయి మరణించడం పట్ల ఆయన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు ఎవరిని బయటికి రానివ్వకుండా ముఖ్యంగా చిన్నారులను రానివ్వకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎడతెరిపిలేని వర్షం
నవతెలంగాణ కల్లూరు
అల్పపీడనం కారణంగా సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో ప్రజాజీవనం స్తంభించిపోయింది. మండలంలోని అన్ని చెరువులు ఇప్పటికే నిండి ఉండటంతో కురుస్తున్న వర్షాలకు అలుగులు పారుతున్నాయి. సుమారు 70 మీల్లిమీటర్ల వర్షం పడింది.
పొంగి ప్రవహిస్తున్న వాగులు
కొణిజర్ల : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అనేక వాగులు, ఏర్లు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం నుంచి మండలంలోని అనేక గ్రామాల రాకపోకలు నిలిచి పోయాయి. పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్ళే రహదారి మధ్యలో తీగలబంజర సమీపంలో గల పగిడేరు అంజనాపురం సమీపంలో గల నిమ్మవాగులు ఉధృతంగా వంతెనపై నుంచి ప్రవహిస్తున్నాయి. దీంతో పల్లిపాడు ఏన్కూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మల్లుపల్లి సమీపంలో వాగు పొంగి ప్రవహించటంతో రామనర్సయ్య నగర్, మల్లుపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వందలాది ఎకరాలు పత్తి, వరిపొలాలు నీట మునిగాయి. కాత, పూత దశలోఉన్న పత్తి చేలల్లో నీరు నిలిచి ఉండటం వలన పూతరాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు.
తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం అల్పపీడనం వల్ల మండలంలో సోమవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షాలు కురవడంతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది. మండలంలో గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండలను తలపించేలా వున్నాయి. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా అంతకుముందే నీళ్లు వదిలటంతో చెరువులు కుంటలు నిండినాయి. మండలంలో మిరప, పత్తి, వరి, పొలాలకు అపార నష్టం వాటిల్లింది. అనేక ఎకరాల్లో ఫైరులు దెబ్బతిన్నాయి.