Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ(ఎం) కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు వైరాలో సోమవారం యంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, వైరా తహసీల్దార్ హైచ్.రంగాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారితో లక్షల మంది చనిపోయారని, కోవిడ్ వలన మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన పన్నులను ఎత్తివేయాలి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగానికి ఏక కాలంలో రుణమాఫీ చేయాలని, ధరణిలో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాలని, నిర్మాణం మొదలు పెట్టిన ఇండ్లను త్వరిత గతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు, కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల నాయకులు పారుపల్లి కృష్ణారావు, కొంగర సుధాకర్, గుడిమెట్ల మెహన్రావు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందాయని సీపీఐ(ఎం) మండల నాయకులు టీఎస్ కళ్యాణ్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ పిలుపుమేరకు సోమవారం ముదిగొండ తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ తూమాటి శ్రీనివాస్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, ఐద్వా మండల అధ్యక్షులు మందరపు పద్మ,సిపిఎం నాయకులు మందరపు వెంకన్న, ఇరుకు నాగేశ్వరరావు సిఐటియు నాయకులు ఉట్కూర్ నాగేశ్వరరావు, ఉప్పు భాస్కర్,ఎస్ఎంఎస్ చైర్మన్ సూరపల్లి నాగరాజులు పాల్గొన్నారు.