Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రోజంతా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరి రవాణ వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. ఖమ్మలో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోకి వర్షపు నీరు చేరింది. నగరంలో డ్రైనేజీలు ఉప్పొంగడంతో వీధులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొత్తగూడెం రైల్వే అండర్‌బ్రిడ్జి రోడ్డుపైకి నీరు చేరడంతో రెండు ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకుపోయాయి. కొత్తగూడెం వద్ద జగదల్పూర్- విజయవాడ జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. రోడ్డుకు గండికొట్టి వరదనీరు తీసివేస్తు న్నారు. రాబోయే మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని హెచ్చరించారు. వాగులు, వంకలు ఉప్పొంగుతున్న దృష్ట్యా ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. చెరువులు, వాగుల వద్ద పోలీసు పర్యవేక్షణ చేపడుతున్నారు.
ఖమ్మం, కొత్తగూడెంలో 2000 మి.మీపైగా వర్షపాతం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ 2000 మి.మీపైగా వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే... భద్రాద్రి జిల్లాలో 2368.8 మి.మీ వర్షపాతం నమోదవ్వగా ఖమ్మంలో 2209.6 మి.మీ వర్షం కురిసింది. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, దమ్మపేట, పాల్వంచలోని యానంబైలులో 120-170 మి.మీ అతి గరిష్ఠ వర్షపాతం నమోదవడంతో ఆరెంజ్ జోన్‌గా పేర్కొన్నారు. ఈ జిల్లాలోని 13 ప్రాంతాల్లో 64.5 నుంచి 114.8 మి.మీ గరిష్ట వర్షం కురిసింది. ఎనిమిది చోట్ల 16.5-55.3 మి.మీ సాధారణ వర్షపాతం నమోదైంది. పాత కొత్త గూడెంలో 170 మి.మీ వర్షం కురిసింది. భద్రాచలం వద్ద గోదావరిలో 26.02 అడుగుల నీటిమట్టం ఉంది. తాలిపేరు ప్రాజెక్టు రెండు గేట్లు రెండు ఫీట్ల ఎత్తు ఎత్తి 2,536 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
- ఖమ్మం జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో పది ప్రాంతాల్లో 65.5-91.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి పట్టణంలో అత్యధికంగా 91.8 మి.మీ వర్షం కురిసింది. మండలంలోని సదాశివపాలెంలో 82 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో 80 మి.మీ వర్షం కురిసింది.
ఖమ్మం, కొత్తగూడెంలో ఉప్పొంగిన డ్రెయిన్లు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం కొత్తగూడెంలో డ్రెయిన్లు రోడ్డు ఎక్కాయి. వర్షపునీటితో కలిసి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఖమ్మం వన్‌టౌన్, త్రీటౌన్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో డ్రెయినేజీల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మార్కెట్ యార్డులోకి నీరు చేరింది. రైతులు ఇబ్బంది పడ్డారు. కొత్తగూడెంలోనూ ఇదే పరిస్థితి. డ్రెయినేజీలు ఉప్పొంగి రోడ్డుపైకి నీరు చేరడంతో రెండు ఆర్టీసీ బస్సులు ఆ నీటిలో చిక్కుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూటీం సహాయంతో ప్రయాణీకులు బయటపడ్డారు. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలంలోని విద్యానగర్, ప్రశాంత్‌నగర్, రాంనగర్, చేతకొండ, హమాలీకాలనీ, రామవరం, సుభాష్‌చంద్రబోస్ నగర్ జలమయం అయ్యాయి. రామ్‌నగర్‌లో ఓ ఆటోడ్రైవర్ ఇల్లు కూలింది. ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం తదితర పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలుచోట్ల రోడ్లెక్కిన నీరు
ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల నీళ్లు రోడ్ల మీదుగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెంలోని జగదల్పూర్- విజయవాడ హైవే మీదుగా నీరు ప్రవహిస్తోంది. పాల్వంచ- దమ్మపేట వద్ద జాతీయ రహదారిపైకి గుర్రాలకుంట బస్‌షెల్టర్ వద్ద ముర్రేడు వాగు రోడ్డు ఎక్కడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వాపురం మండలంలోని ఇసుకవాగు ఉధృతికి అశ్వాపురం-గొందిగూడెంకు రాకపోకలు ఆగాయి. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నుంచి మణుగూరు వెళ్లే రహదారిపైకి భారీగా వరదనీరు చేరింది. టేకులపల్లి మండలం పుణ్యవాగు ఉప్పొంగడంతో కొత్తగూడెం నుంచి ఆళ్లపల్లి వచ్చే ప్రధాన రహదారి నీటమునిగింది. అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం వాగు ఉధృతికి వెంకటాపురం రాళ్లవాగు వంతెన మునిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగలిగొండ మునగాల గ్రామాల మధ్య వాగునీరు రోడ్డుమీదుగా ప్రవహిస్తోంది. సత్తుపల్లి, తిరుమలాయపాలెం, తల్లాడ, కూసుమంచి మండలాల్లోనూ పలుచోట్ల నీరు రోడ్లమీదుగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పంటచేలోకి నీరు చేరాయి. ఇటీవల వేసిన మిర్చి మొక్కలు దెబ్బతింటున్నాయి. వరి, పత్తి చేలకు ఈ వర్షాలు నష్టం చేస్తున్నాయి.
ముదిగొండ : సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జడివానతో జనజీవనం అస్తవ్యస్తంగా మారి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. మండలంలో ఇప్పటికే అనేక దఫాలుగా కురిసిన వర్షాల వరద ఉధృతికి పంటలు మునిగిపోయి రైతులకు తీవ్రనష్టాన్ని కలిగించాయి పత్తి చేలల్లో నీరు చేరి పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంది.
చింతకాని:రోజంతా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో మండలంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. చింతకాని మండలం నాగిలిగొండ కొనిజర్ల మండలం మునగాల గ్రామాల మధ్య వాగు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో గ్రామాల మధ్య రాకపోకలు అధికారులు నిలిపివేశారు. వరద తీవ్రతను మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ పరిశీలించారు.