Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎండతెరపిలేని వర్షాలతో మునక...
అ భద్రాద్రిలో 218.98 సెం.మీ వర్షం..
ఖమ్మంలో 139.62 సెం.మీ
అ కొత్తగూడెంలో 2,932 రైతులకు
చెందిన 5,786 ఎకరాలు నీటిపాలు
అ ఖమ్మం జిల్లాలో 1,102 మంది
రైతులు.. 1,721 ఎకరాల్లో నష్టం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మంగళవారం ఉదయం వరకు రెండు జిల్లాల్లో దంచికొట్టాయి. భద్రాద్రి జిల్లాలో 2189.8 మి.మీ వర్షం కురవగా 2,932 మంది రైతులకు చెందిన 5,786 ఎకరాల పంటలు నీటిపాలయ్యాయి. ఖమ్మం జిల్లాలో 1396.2 మి.మీ వర్షపాతం నమోదవగా 1,721 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 1,102 మంది రైతులకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలో తేలింది.
- భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా మునక
ఈ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో 235.2 మి.మీ వర్షం కురిసింది. ఈ జిల్లాలో చండ్రుగొండ, గుండాల, పినపాక, చర్ల మినహా మిగిలిన అన్ని మండలాల్లో 100 మి.మీ పైగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల ధాటికి పత్తి, వరి, మిరప తదితర పంటలు నీటిపాలయ్యాయి. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైన 8 మండలాలను ఆరెంజ్ జోన్‌గా ప్రకటించారు. ఈ ఏడాది జూన్, ఆగష్టులో లోటు వర్షపాతం నమోదవగా సెప్టెంబర్ నెల ఆరంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ వరకు 37.8 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 235.6 మి.మీ వర్షపాతం నమోదవడం గమనార్హం. 2021 ఖరీఫ్ సాగు ప్రణాళిక ప్రకారం జిల్లాలో 4,61,850 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 4,25,684 (92%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 2,52,684 ఎకరాల్లో పత్తి సేద్యం చేశారు. వరి 1,30,916 ఎకరాలు, మొక్కజన్న 30,605 (174%) ఎకరాల్లో సాగు చేశారు. దీనిలో 1811 మంది రైతులకు చెందిన 3,331 ఎకరాల వరి, 1,084 మంది రైతులకు చెందిన 2,405 ఎకరాల పత్తి, 37 మందికి చెందిన 50 ఎకరాల మొక్కజన్న మొత్తంగా 2,932 మంది రైతులకు చెందిన 5,786 ఎకరాల్లో వివిధ పంటలు నీటమునిగాయి. అత్యధికంగా జూలూరుపాడు మండలంలో 1022 ఎకరాల పత్తి, 527 ఎకరాల వరి మొత్తం 641 మంది రైతులకు చెందిన 1,549 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. బూర్గంపాడు మండలంలో వరి 1,098 ఎకరాలు, పత్తి 230 మొత్తం 1328 ఎకరాల్లో 715 మంది రైతుల పొలాలు నీటమునిగాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలో 37 మంది రైతులకు చెందిన 57 ఎకరాలు నీటిపాలైంది.
- ఖమ్మం జిల్లా కూసుమంచి డివిజన్లో అధికంగా నీటిపాలు
ఖమ్మం జిల్లాలో 1396.2 మి.మీ వర్షపాతం నమోదవగా 1,721 ఎకరాల్లో పంట నీటిపాలైంది. దీనిలో అత్యధికంగా కూసుమంచి డివిజన్లో నష్టం చోటు చేసుకుంది. ఈ డివిజన్లో 662 మంది రైతులకు చెందిన 1040.35 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మధిరలో 321, సత్తుపల్లిలో 198, వైరా డివిజన్లో 162 ఎకరాల్లో వివిధ పంటలు నీటిపాలయ్యాయి. ఈనెల 2వ తేదీన కూడా కూసుమంచి డివిజన్‌లోనే 150 మి.మీకు పైగా వర్షపాతం నమోదైంది. అప్పుడే డివిజన్లో 1,262 ఎకరాల్లో పంటనష్టం చోటుచేసుకుంది. తిరిగి ఆ రైతులు తేరుకోకముందే 5,6 తేదీల్లో వర్షాలు ఎడతెరపిలేకుండా కురిశాయి. ఫలితంగా ఆ డివిజన్ రైతులు తీరని నష్టం చవిచూడాల్సి వచ్చింది.
- మిరప రైతు గగ్గోలు...
ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడం, జలవనరుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ ఏడాది మిర్చి రైతులు ముందుగానే నార్లు పోశారు. ఎకరానికి ఇప్పటికే రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టి మిరప మొక్కలు నాటారు. దాదాపు 60% మిర్చి నాట్లు పడ్డాయి. దీనిలో 50 శాతం వరకు వారం, పదిరోజుల వ్యవధిలోనే నాటారు. ఈ క్రమంలోనే వర్షాలు కుండపోతగా రావడంతో మిరప తోటల్లో వరదలు పారాయి. ఈ వర్షం ఉధృతికి మిరప మొక్కలు కొట్టుకుపోయాయి. పల్లపు ప్రాంతాల్లో ఉన్న కొన్ని తోటల్లో మొక్కలు మునగ నీరు నిలిచాయి. 33% నష్టం చోటుచేసుకోనిదే ప్రాథమిక సర్వేలో పరిగణనలోకి తీసుకోమని ఖమ్మం జిల్లా ఉద్యానశాఖ అధికారి అనుసూయ తెలిపారు. వేలాది రూపాయల పెట్టుబడి వర్షంధాటికి కొట్టుకుపోయిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కానీ ఉద్యానశాఖ ఏ ఒక్క మిర్చి రైతుకు నష్టవాటిల్లలేదని నివేదిక ఇచ్చింది.