Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాలుష్యాన్ని నివారించండి
అ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుందాం... పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. వినాయక చవితి మహౌత్సవాల్లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం పోస్టాఫీస్ సెంటర్లో సింగరేణి పాఠశాల వద్ద ప్రజలకు ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి ప్రతిమలతో చేసిన వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం జరగదని, రసాయనాలతో చేసిన విగ్రహాలు నిమజ్జనంతో నీటిలో జీవించే జీవరాసుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం పట్టణంలో మట్టి ప్రతిమల విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 9 రోజులు పాటు పరమ పవిత్రంగా నిర్వహించనున్న గణపతి నవరాత్రులను ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా జరుగుపుకోవాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవి శంకర్, సింగరేణి ఎన్విరాన్మెంట్ జియం కొండయ్య తదితరులు పాల్గొన్నారు.