Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
కూరగాయల సాగు భలే లాభసాటి. కూరగాయల సాగులో ముష్టికుంట్ల అన్నదాతలు రైతాంగానికి ఆదర్శంగా కొన్నేళ్లుగా నిలుస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. సంవత్సరానికి అన్ని ఖర్చులు పోను రూ 1.75 నుంచి 2.00 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. వాణిజ్య పంటలు సాగు చేసి అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతుండగా మరొకవైపు ముష్టికుంట్ల అన్నదాతలు కూరగాయల సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ముష్టికుంట గ్రామానికి చెందిన డేగల లక్ష్మీనారాయణ, బొడ్డుపల్లి నాగచంద్రుడు, బొడ్డుపల్లి మల్లికార్జునరావు సుమారు పదేళ్ల నుంచి వాణిజ్య పంటలపై నష్టం వస్తుండటంతో కూరగాయల సాగుపై దృష్టి సారించారు. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ కూరగాయల పంటలను సాగుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సలహాలు, సూచనలు తీసుకుంటూ కూరగాయల సాగులో దూసుకుపోతున్నారు. కూరగాయల సాగులో రోజురోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా అధునాతన పద్ధతులలో కూరగాయలను సాగు చేస్తున్నారు. డేగల లక్ష్మీనారాయణ తనకు గల ఎకరంన్నర పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని కూరగాయల పంటలను సాగు చేస్తున్నాడు. ఎకరం రూ.30 వేల చొప్పున రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది రెండు ఎకరాలలో దోసకాయ, అర ఎకరం పొలంలో బీరకాయ, మరో అర ఎకరం పొలంలో పొట్లకాయ, అర ఎకరం పొలంలో బెండకాయ సాగు చేశాడు. తనకు గల ఎకరంన్నర పొలంలో 2015 సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామని ప్రకటించడంతో లక్ష్మీనారాయణ డ్రిప్ ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీపై ఇవ్వలేదు. దీంతో అప్పు చేసే తన సొంత పొలంలో కూరగాయల సాగు కోసం డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సంవత్సరం 70 వేల రూపాయల వరకు డ్రిప్ ఇరిగేషన్ కోసం ఖర్చు అయినట్లు లక్ష్మీనారాయణ తెలిపాడు. మొదటి సంవత్సరం డ్రిప్ ఇరిగేషన్ ఖర్చు మొత్తం కూరగాయల మీద వచ్చినట్లు తెలిపాడు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసిన తర్వాత కూరగాయల సాగు కోసం శాశ్వత పందిరిని ఏర్పాటు చేశాడు. ఇందులో పొట్లకాయ, బీరకాయ పంటలను సాగు చేశాడు. ఈ సంవత్సరం కూరగాయల సాగుపై 70 వేలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపాడు. 70 వేల రూపాయల పెట్టుబడి పోను ప్రస్తుతం నేటి వరకు పొట్లకాయ, బీరకాయ పంటలపై రూ 1.5 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా పొట్లకాయ, బీరకాయ పంట 40 శాతం వరకు పొలం లో ఉంది. దోసకాయ దిగుబడి మరో వారం పది రోజులలో ప్రారంభం అవుతుంది. మిగిలిన పంటపై ఇంకా 50 నుంచి 70 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని లక్ష్మీనారాయణ తెలిపాడు. సంవత్సరం మొత్తం మీద ఖర్చు మొత్తం పోను సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని లక్ష్మీనారాయణ తెలిపాడు. కూరగాయల సాగు కంటే ముందు అందరి రైతుల లాగానే తాను కూడా వాణిజ్య పంటలు సాగు చేసి ఎంతో నష్టపోయానని తెలిపాడు. మా గ్రామంలో గల సహచర అన్నదాతలు బొడ్డుపల్లి నాగచంద్రుడు, బొడ్డుపల్లి మల్లికార్జునరావు సూచనలతో తాను కూడా కూరగాయల సాగుపై దృష్టి సారించినట్లు తెలిపారు. 2016 నుంచి నుంచి నేటి వరకు కూరగాయల సాగుపై ప్రతి సంవత్సరం అన్ని ఖర్చులు ఫోను మంచి మిగులు ఆదాయమే పొందుతున్నట్లు తెలిపాడు. కూరగాయల సాగులో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక పద్ధతులను పాటిస్తున్నానని తెలిపాడు. కూరగాయల సాగులో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా అంతే విధంగా వస్తుందని తెలిపాడు. కూరగాయల సాగు వలన తనకు ఎటువంటి అప్పులు లేకపోగా ఆదాయంతోనే ప్రతి సంవత్సరం ముందుకు సాగుతున్నానని తన కుటుంబం తాను ఎంతో సంతోషముగా గడుపుతున్నామని లక్ష్మీనారాయణ ఆనందంతో తెలిపాడు.