Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
త్రిపుర రాష్ట్రం అగర్తలాలోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేసి నిప్పంటించడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. దాడిని ఖండిస్తూ గురువారం ఖమ్మంలోని సుందరయ్య భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సరిత క్లీనిక్ సెంటర్ లో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇటీవల సెఫాహిజలా జిల్లాలో ధనప్పూర్ వద్ద సీపీఐ(ఎం) కార్యకర్తలతో జరిగిన ఘర్షణకు నిరసనగా బీజేపీ గూండాలు ఈ దాడులకు తెగబడ్డారని నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఘర్షణ విషయాన్ని ప్రచురించిన దినపత్రిక ప్రతినిధి కలామ్ కార్యాలయంపై కూడా దుండగులు దాడి చేశారన్నారు. మొత్తంగా ఆ పత్రిక కార్యాలయ భవనాన్ని ధ్వంసం చేశారన్నారు. ఆ పత్రిక సంపాదకుని వాహనాన్నీ నాశనం చేశారని చెప్పారు. జర్నలిస్టుల మోటార్బైక్లను తగలబెట్టారన్నారు. దాడిలో ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారని తెలిపారు. ఇటీవల సీపీఐ(ఎం) చేపట్టిన రాజకీయ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరైన ఐంకారమత్ ప్రాంతంలో ఒక ప్రణాళిక ప్రకారం మూడు భవనాలపై దాడులు జరిగాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, పేరా మిలటరీ బలగాలు కేవలం మౌన పాత్ర వహించాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి విమర్శించారు. వివిధ పార్టీ కార్యకర్తలు, నేతల ఇండ్లపై కూడా దాడులు జరిగాయని తెలిపారు. బీజేపీ గూండాలు పోలీసులతో కుమ్మక్కై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) కార్యాలయాలపై వరుస దాడులకు దిగారన్నారు. బీజేపీ నాయకత్వం మౌనంగా వుండడంతో ఈ తరహా దాడులు కొనసాగుతున్నాయన్నారు. త్రిపురలోని పలు జిల్లాల్లో సీపీఐ(ఎం), పత్రిక కార్యాలయా లపై బీజేపీ అల్లరి మూకలు జరిపిన దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, వై.విక్రమ్, మెరుగు సత్యనారాయణ, తుశాకుల లింగయ్య, పి.ఝన్సీ, నాయకులు ఎస్.కె.వి.మీరా, యం.డి.గౌస్, ప్రకాశ్, భాగం అజిత, పి.నాగేశ్వరరావు, హిమామ్, శివారెడి, కాంపాటి వెంకన్న, దేవేంద్ర, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
మధిర : సిపిఎం టౌన్ కమిటీ మండల కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ కార్యదర్శి శీలం నర్సింహారావు, మండల కార్యదర్శి మంద సైదులు టౌన్ కమిటీ సభ్యులు పడకంటి మురళీ, తేలప్రోలు రాధాకృష్ణ, వడ్రాణం మధు, మండల కమిటీ సభ్యులు ఓట్ల శంకర్రావు, శివయ్య పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : త్రిపుర రాష్ట్రంలోని సిపిఎం కార్యాలయంపై బిజెపి, ఆర్ఎస్ఎస్ గూండాలు దాడి చేయడం దుర్మార్గమని సిపిఎం ఖమ్మంరూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అన్నారు. సిపిఎం కార్యాలయంపై దాడిని ఖండిస్తూ సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎం.వెంకటాయపాలెం గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏపూరి వర కుమార్, వడ్లమూడి నాగేశ్వరరావు, పాపిట్ల సత్యనారాయణ, వడ్లమూడి మల్లయ్య, ఏపూరి నాగేశ్వరరావు, కంకిపాటి రాములు, జాలా లింగయ్య, గుర్రం హుస్సేన్, మాసిపొంగు సైదులు, దాసరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.