Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగినందున వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రైమరీ స్కూల్స్ నుంచి హై స్కూల్స్‌కి పెట్టిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్స్ రద్దు చేసి అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను నియమించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) రాష్ట్ర నాయకులు చావా. దుర్గా భవాని, బండి. నరసింహారావులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యుటీఎఫ్ భవన్లో జి.వి.నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడం మంచి పరిణామం అని, అందుకు అనుగుణంగా అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను నియమించి విద్యార్థుల నమోదు నిలుపుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నుంచి హై స్కూల్స్‌కు ఉపాధ్యాయులను డెప్యూటేషన్‌పై
నియమించడం వల్ల ప్రాథమిక పాఠశాలలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేక తరగతుల నిర్వహణ ఇబ్బంది కరంగా మారిందని, అందువల్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తక్షణమే విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేసే స్కావెంజర్స్‌ని నియమించలేదని, ఆ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించడం వల్ల కొన్నిచోట్ల గ్రామ పంచాయతీలు అందుకు తగిన ఏర్పాటు చేసినా అనేకచోట్ల గ్రామ పంచాయతీలు ఆ బాధ్యతలు తీసుకోవడం లేదని, అందుకు కేటాయించిన వారు ఉదయం వచ్చి పాఠశాల ఆవరణ లేదా గదులు వరకు శుభ్రం చేసి వెళ్లిపోతున్నారని, మూత్రశాలల పరిశుభ్రత, గదుల శానిటైజేషన్ పట్టించుకోవడంలేదని వారు తెలియజేశారు.
జీపీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి
పది జిల్లాల తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా విభజించినందున అన్ని జిల్లాల్లో జెడ్పీ జిపిఎఫ్ ను నిర్వహించాలని, పాత పది జిల్లాల పరిధిలో ఉన్న జిపిఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతూ ఈనెల 13న అన్ని జిల్లా పరిషత్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రాతినిధ్యాలు చేయనున్నట్లులి టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి వి నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావులు తెలియజేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పిఆర్సీ బకాయిలు ఈనాటి వరకు జమ కాలేదని, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ లు, సిపియస్ ఉపాధ్యాయుల డిఎ బకాయిలు, ఇతర ఏరియర్ బిల్లుల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం జరుగుతుందని, నెల మొదటి తేదీకి జీతాలు కూడా చెల్లించని పరిస్థితిని నిరసిస్తూ ఈ నెల 16న అన్ని ఖజానా కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని పోరాట కార్యక్రమాలను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్.కె. మహబూబ్ అలీ, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుభాషిని, బుర్రి వెంకన్న, కోశాధికారి వి.రాంబాబు, కార్యదర్శులు షేక్ రంజాన్, మంగీలాల్, నరసయ్య, గీత, రమేష్, సురేష్, లక్ష్మణరావు, రాజేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.