Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆదివాసీ గుడిసెలకు నిప్పు పెట్టిన వ్యక్తులు
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఆదివాసీల గుడిసెలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ భూమి నుంచి తమను వెళ్ళగొట్టే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతోందని బాధిత ఆదివాసీ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గతంలో రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు తమ గుడిసెలను పీకేసి ఒక్క కర్రా మిగల్చకుండా పట్టుకపోయారని, అయినా నానా బాధలుపడి తాము మళ్ళీ గుడిసెలు వేసుకుంటే ఇప్పుడు ఏకంగా గుడిసెలకు నిప్పుపెట్టి కాల్చి, కూల్చారని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. మరీ ఇంత దుర్మార్గమా..! అని బాధిత ఆదివాసీలు ఆగ్రహిస్తున్నారు. ఈ భూమి తమకు ప్రభుత్వం ఇచ్చిందని, 28 కుటుంబాలకు పట్టాలు కూడా ఉన్నాయని, రైతుబంధు కూడా వస్తోందని తెలిపారు. సర్వే నంబర్ కరక్టు కాదనే వంకతో ఈ భూమి ఏకలవ్య పాఠశాలకు కేటాయిస్తూ ఇప్పటి రెవిన్యూ అధికారులు ఈ భూమి నుంచి తమను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంటే, 15 ఏళ్ళుగా తమ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కాపాడుకొనేందుకు పట్టాలు చేత పట్టుకొని మరో భూపోరాటం చేస్తున్నామని ఆదివాసీలు తెలిపారు. భూమి దున్ని ఇటీవల విత్తనాలు చల్లి, మకాం ఉండటానికి గుడిసెలు వేస్తే ఎవరో గిట్టనివారు వాటిని నాశనం చేయడం ఎంతవరకు కరెక్టని నిరుపేద ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రాణాలు ఫణంగా పెట్టి భూమిని కాపాడుకుంటామని ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు. తమ సహనాన్ని పరీక్షింప వద్దని, తమకు పట్టుబడిన రోజు దుండగుల సంగతి తేల్చుతామని ఆదివాసీలు హెచ్చరించారు.