Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
టీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి గ్రామ, మండల, అధ్యక్ష పదవుల నియామకం చేపడుతున్నారు. అందులో బాగంగా మండల అధ్యక్ష పదవి ఎవరికి దక్కేనోనని పార్టీ నాయకుల్లో ఊహాగానాలు వెల్లువెత్తు తున్నాయి. ఆశల పల్లకిలో ఆశావాహులు కలలు కంటున్నారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతను పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకపోవడం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల సమాచారాన్ని నాయకులకు తెలియపరచకపోవడంతో నాయకుల నుంచి అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు.ఈ దశలో పార్టీ మండల అధ్యక్ష పదవికి మార్పు తప్పదని అతనికి వ్యతిరేక వర్గం బాహాటంగా తెలిపారు.
మధిర నియోజవర్గ పరిధిలోని ఐదు మండలాలకు అధ్యక్ష పదవుల ఎంపికలో సామాజిక వర్గాల సమీకరణలు చేపట్టి అందులో భాగంగా ఎర్రుపాలెం మండల అధ్యక్ష పదవి ఓసి వర్గాలలో కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఎర్రుపాలెం సొసైటీ అధ్యక్షులు జమలాపురం గ్రామానికి చెందిన మూల్పూరి శ్రీనివాసరావుకు పదవి కట్టబెట్టే యోచన ఉన్నట్లు పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ నుండి చావా రామకృష్ణతోపాటు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలంలో చావా అనుచరుడిగా కొనసాగటం కమలరాజుకు సన్నిహితుడిగా ఉంటుండడంతో అతనికి ఈ పదవి వస్తుందేమోనని పార్టీ వర్గాలు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అతనికి ఉన్న వ్యాపార ఒత్తిడిలో అతను ఉండక పోవచ్చునని కొంతమంది తెలిపారు. శ్రీనివాస రావు భార్య జమలాపురం గ్రామ సర్పంచ్‌గా తమ్ముడి భార్య శైలజ ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మండల నాయకుడు రేమిడిచర్ల గ్రామానికి చెందిన కొండెపాటి సాంబశివరావు పార్టీ పరంగా పదవి వస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
గత కొద్ది రోజుల నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పని చేస్తున్నాడు. కమలరాజు అతనికి మండల బాధ్యతలు కొన్ని అప్పగించడంతో అప్పగించిన బాధ్యతలను తూచా తప్పక చేస్తున్నాడు. మూల్పూరికి మండల అధ్యక్ష పదవి ఇష్టంలేని పరిస్థితుల్లో కొండెపాటికి మద్దతు తెలపవచ్చని తెలుస్తుంది. ఓసీలలోనే రెడ్డి సామాజిక వర్గానికి పదవి కేటాయించితే సిపిఎం నుండి కమలరాజుతో పాటు మండలంలో పార్టీ మారిన ఒకే ఒక వ్యక్తి ప్రస్తుతం ములుగుమాడు సొసైటీ అధ్యక్షుడిగా రామన్నపాలెం గ్రామానికి చెందిన శెట్టిపల్లి మదన్ మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. సిపిఎంలో మండల ఆర్గనైజర్ గా పని చేసిన అనుభవంతో పాటు కమల్ రాజు ఆశీస్సులు ఉండటంతో తప్పక అధ్యక్ష పదవి వస్తుందేమోనని ప్రచారంఉంది.
అదే సామాజిక వర్గం నుండి చావా రామకృష్ణకు ముఖ్య అనుచరుడిగా రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ శీలం వెంకటరామిరెడ్డి పేరు కూడా ప్రచారం ఉంది. అతని భార్య శీలం విజయలక్ష్మి బుచ్చిరెడ్డిపాలెం ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. బీసీలకు కేటాయిస్తే ఎరుపాలెం గ్రామానికి చెందిన బుర్ర వెంకటనారాయణ పేరు ప్రచారంలో జోరుగా వినిపిస్తుంది. బీసీ వర్గంలో మరొకరు ఎవరు అతనికి పోటీలో కనిపించడం లేదు.
ఇతను ప్రస్తుతం టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏ వర్గానికి సంబంధం లేని వాడిగా, వివాద రహితుడిగా మండల కేంద్రంలో ఉండే వ్యక్తి కావడంతో బీసీ వర్గానికి కేటాయించితే తప్పక పదవి వరించ వచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మండలంలో నివురుగప్పిన నిప్పులా వర్గ పోరు కొనసాగుతుండటంతో ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తికి మండల అధ్యక్ష పదవి వస్తుందోనని ఎదురు చూస్తున్నారు.