Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు రూ. 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. గురువారం మంచికంటి భవన్లో మల్లారపు యాలాద్రి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ తరతరాల నుండి వృత్తి చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రభుత్వ లిక్కర్ పాలసీ వలన రోజు రోజుకి వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్, బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిస్తూ గీత కార్మికులకు పూర్వవైభవం తెస్తామని ఆబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడం శోచనీయం అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యనిషేధం అమలు చేయాలని అన్నారు.
ప్రతీ సొసైటీకి 5 ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు. సభ్యులైన ప్రతి ఒక్కరికి బైక్ లు ఇవ్వాలని, కల్లు గీత వృత్తిదారులకు గీతన్న బంధు పేరుతో రూ.10 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి బోడపట్ల సుదర్శన్ మాట్లాడుతూ పెన్షన్ ఐదు వేలకు, ఎక్స్‌గ్రేషియా పది లక్షలకు పెంచాలని, మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని, అర్హులైన వారందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు కొత్త జిల్లాల పేరుతో ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, జిల్లా నాయకులు నాయుడు చందర్రావు, మొక్క నాగేశ్వరరావు, కొండం కర్ణాకర్, పామర్తి వాసు, తీగల వెంకటేశ్వర్లు, మద్దెల పుల్లారావు, జలగం వెంకట్రావు, మోట పోతుల వెంకటేశ్వర్లు, నాతి అంజయ్య, నాతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.