Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత విప్లవానికి అనేక పాఠాలు నేర్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఐదేళ్లపాటు కొనసాగింది. 1946-51 మధ్యకాలంలో సాగిన ఈ పోరాటానికి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వం వహించాయి. నైజాం ఫ్యూడల్ ప్రభువులకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది. జాగీర్దార్లు, జమీన్దార్లు భూమిపై హక్కుదారులుగా, పటేల్, పట్వారీలు నిరంకుశ గ్రామపాలకులుగా ప్రజలను పీడించేవాళ్లు. ఈ క్రమంలో 'దున్నేవానికి భూమి, వెట్టి చాకిరీ రద్దు' 'నిజాం గద్దె దిగాలని' కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు తెలంగాణలో మార్మోగింది. నిజాం నిరంకుశ ప్రభుత్వం సాగించిన హత్యాకాండ.. రజాకారు సైన్యాలకు వ్యతిరేకంగా 'రైతాంగ సాయుధ పోరు' ప్రారంభమైంది. ఈ పోరాటంలో సుమారు 4,000 మంది కమ్యూనిస్టులు అసువులు బాసారు. వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాట యోధుల గురించి క్లుప్తంగా...
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాట యోధులు...
- కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మంచికంటి కిషన్‌రావును ఖమ్మం జిల్లా కాచిరాజుగూడెంకు చెందిన భూస్వామి, పట్వారి అయిన మంచికంటి తిరుమలరావు దత్తత తీసుకున్నారు. కిషన్‌రావు రైతాంగ, వ్యవసాయ, కూలీ, కార్మిక తదితర సంఘాలన్నింటిలోనూ పనిచేశారు. 1953 పార్టీ జిల్లా కార్యదర్శిగా తాత్కాలికంగా పనిచేశారు.
- చిర్రావూరి లక్ష్మీనర్సయ్య 1915 మార్చి 20న జన్మించారు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. కార్మికసంఘ నిర్మాణంలో పాలుపంచు కున్నారు. 1945మేలో ఖమ్మంలో జరిగిన 12వ ఆంధ్రమహాసభకు ప్రాతినిధ్యం వహించారు. జైలు నుంచే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్‌గా 30 ఏళ్లపాటు కొనసాగారు.
- ఇల్లెందు తాలుకా బేతంపుడి గ్రామంలో 1926లో జన్మించిన కొండపల్లి లక్ష్మీనర్సింహారావు తెల్దారుపల్లి భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా తమ్మినేని సుబ్బయ్య సహకారంతో పోరాటం నిర్వహించారు. ఇల్లెందు ఎమ్మెల్యేగా కేఎల్ 1952-67 వరకు పనిచేశారు.
- తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గన్న నల్లమల గిరిప్రసాద్ది మధిర తాలూకా తొండలగోపవరం గ్రామం. పాల్వంచ ప్రాంతంలో దళనాయకుడిగా, ఏరియా పోరాట కమిటీ సభ్యునిగా మన్యం ప్రజల్లో చైతన్యం నింపారు.
- సింగరేణి కార్మిక సంఘ ఉద్యమాల ద్వారా తెలంగాణ సాయుధ పోరాటంలోనూ భాగస్వామ్యం వహించారు పర్సా సత్యనారాయణ.
- 'కమ్యూనిస్టు పార్టీయే నన్ను మనిషిని చేసింది' అని దాశరథి రంగాచార్య పేర్కొన్నారు. ఈయన సోదరుడు దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ కోసం జైలు పాలయ్యారు. పుట్టింది వరంగల్ జిల్లా అయినా ఖమ్మం, గార్లలో నివాసమున్నారు. దాశరథి కృష్ణమాచార్యయే తెలంగాణ అనే పదాన్ని ముందుగా ఉపయోగించారు. అంతకుముందు నైజాం అని సంబోధించేవారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' కృష్ణమాచార్య వ్యాఖ్యానమే.
- కొత్తగూడెం సింగరేణి బగ్గుగని కార్మిక సంఘం నాయకులు శేషగిరిరావుకు కొరియర్‌గా పనిచేశారు బోడేపూడి వెంకటేశ్వరరావు. పాటలు, పద్యాలు లయబద్ధంగా పాడగల నేర్పరి. ఆంధ్ర ప్రజానాట్యమండలిలోనూ పనిచేశారు. 1979-89 వరకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. 1985 నుంచి 1994 వరకు మధిర శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1991 నుంచి చనిపోయే వరకు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.
- రామిశెట్టి రోశయ్య, పుల్లయ్య, వెంపటి రామకోటయ్య, క్యాంపుపై దాడి చేసి ఆయుధాల సేకరించిన మహ్మద్ జాఫర్, మేకల నారాయణ, పత్రికలందించిన దైవాదీనం, కొల్లు రాఘవయ్య, పుట్టింది జమిందారు కుటుంబంలోనైనా ప్రజాపోరు చేసిన సర్వదేవభట్ల రామనాథం, బోనకల్ మండలం చిరునోముల గ్రామానికి చెందిన రావెళ్ల జానకిరామయ్య కమ్యూనిస్టు పత్రిక 'స్వతంత్ర భారత్'ను పంచి ప్రజల్లో చైతన్యం నింపారు. కర్రసాధనలో దిట్ట పారుపల్లి పట్టాభిరామయ్య, పారుపల్లి పుల్లయ్య, కోటయ్య, మందడపు నారాయణ, కేమా ముత్యాలు, అయితపు మంగపతిరావు, బాలగెరిల్లా దళ సభ్యుడు గంగసాని వీరయ్య, ఎర్రుపాలెం రేమిడిచర్ల వెంకటకృష్ణారావు, ఊట్ల సాంబయ్య, మంగళగిరి సత్యం, తాళ్లూరి కృష్ణమూర్తి, వట్టికొండ రామకోటయ్య, వజ్రాల అప్పారావు, తోట పెద్దగోపయ్య, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వట్టికొండ లక్ష్మీకాంతయ్య, చింతలపూడి జగ్గయ్య, వాసిరెడ్డి అప్పారావు, కొత్తపల్లి కృష్ణమూర్తి, యనమద్ది రామయ్య, వీఎల్ నర్సింహారావు, నున్నా వెంకటనర్సయ్య, సుగ్గుల కృష్ణమూర్తి, మచ్చా వీరయ్య, రావెళ్ల సత్యం, గడపాటి రాఘవయ్య, బోడేపూరి రామకోటేశ్వరరావు, మహ్మద్ రజబ్అలీ, సంక్రాంతి రామచంద్రయ్య, ఏలూరి రాఘవయ్య, నామ గోపయ్య, సుంకర చంద్రయ్య, తిప్పిరెడ్డి రామచంద్రారెడ్డి,కావూరి వెంకయ్య, కొడాలి సుబ్బారావు, గార్లపాటి పెదవెంకయ్య, కావూరి వెంకయ్య, కొంగర నర్సింహారావు, కాణాదుల పిచ్చిరెడ్డి, పోట్ల పాపారావు, తుళ్లూరి నర్సింహయ్య, చావా సాంబయ్య, తమ్మినేని సుబ్బయ్య, పుసులూరి వెంకయ్య, యర్రా వెంకన్న, నువ్వుల వెంకటయ్య, గుర్రం సూరయ్య, శాఖమూరి భాగ్యమ్మ, అప్పయ్య, రావెళ్ల భారతమ్మ, తేనె సీతయ్య, దొండేటి పుల్లయ్య, అలవాల సుభద్ర, వీరవెల్లి మోహన్‌రెడ్డి, రాయల వెంకటనారాయణ, మైసా కొండయ్య, రావుల గోపాలరెడ్డి, సంగబత్తుల రంగారెడ్డి, కమ్మకోమటి రంగయ్య, నున్నా పుల్లయ్య, పుసులూరి బుచ్చయ్య, ఏలూరి వీరయ్య తదితరుల పోరాట పటిమ అనన్యం. ఎందరో కమ్యూనిస్టులు త్యాగాల కోటపై ఎర్రజెండా ఎగురవేస్తే...నేడు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కాషాయమూఖలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని తమ భావాజాలానికి అనుకూలంగా అన్వయించుకునే ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా సాయుధ పోరాట అమరుల సంస్మరణార్థం సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెవిలియన్‌గ్రౌండ్‌లో నిర్వహించే సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా, కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అతిథిగా హాజరవుతున్నారని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.