Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
నైజాం నవాబు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 73 ఏళ్లు నిండాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సాయుధ పోరాట యోధుడు మచ్చ వైకుంఠం నవతెలంగాణకు నాటి పరిస్థితుల గురించి వివరించారు.15 ఆగస్టు 1947లో స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం స్వాతంత్య్రం రాలేదు. నైజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణలోని 8 జిల్లాలను కర్ణాటకలోని 4 జిల్లాలను మహారాష్ట్రలోని రెండు జిల్లాలను స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకొని పరిపాలన చేస్తున్నారు. నైజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం అజరామరం. కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు ఉద్యమకారులు అలుపెరగని పోరు సాగించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన ఈ మహోద్యమంతో నైజాం నవాబుకు ప్రజల ముచ్చెమటలు పట్టించారు.
నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన ఉద్యమకారులు...
బాంచన్ నీ కాళ్లు మొక్కుతా దొర అన్న ప్రజలే నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తుపాకులు చేత పట్టారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఆంధ్ర మహా సభ సాక్షిగా ఈ మహౌద్యమం ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని అంతర్భాగంగా ఉన్న ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామానికి చెందిన సాయుధ పోరాట యోధుడు రావెళ్ల జానకిరామయ్య ఆంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షులుగా, కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో గోవిందాపురం ఎల్, లక్ష్మీపురం, బ్రాహ్మణపల్లి, ముష్టికుంట్ల, రాయన్నపేట, చొప్పకట్లపాలెం, ముష్టికుంట్ల, ఆళ్లపాడు గ్రామాలకు చెందిన యువకులను గెరిల్లా సైనికులుగా తీర్చిదిద్దారు. వీరిలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లు గోవిందా పురం ఎల్ గ్రామానికి చెందిన చుండూరు నరసింహారావు, జొన్నలగడ్డ రామయ్య, తమ్మారపు గోవింద్ ప్రజా నాయకులుగా నియమించబడ్డారు. దళ సభ్యులుగా రావూరి వెంకట రామయ్య, మల్లెల విశ్వ నాదం, తమ్మారపు భద్రయ్య, చుండూరి కృష్ణమూర్తి, పారుపల్లి జోగయ్య, నల్లమల గోపయ్య, మందడపు బుచ్చయ్య, బోడేపూడి శేషయ్య, కర్నాటి రామకోటయ్య, నిమ్మతోట జగ్గయ్య, పొన్నం అనంతరామయ్య, తాళ్లపల్లి రాములు, తమ్మారపు హుస్సేన్, కారంగుల సైదులు, చల్ది వీరస్వామి, తోటకూర లక్ష్మయ్య పని చేశారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంతో వందలాది ఎకరాల భూములను భూస్వాముల దగ్గర నుంచి లాక్కొని పేద ప్రజలకు పంచారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆక్రమించుకొని పేద ప్రజలకు పంచి పెట్టారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోనే కృష్ణాజిల్లా వత్సవాయిలో క్యాంపు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని సాగించారు. కొరియర్‌గా కొత్తపల్లి కృష్ణమూర్తి, నిమ్మతోట సీతయ్య, తమ్మారపు వెంకట కోటయ్య, రెంటాల సీతయ్యతో పాటు మరికొందరు సాయుధ పోరాట యోధులకు తమ వంతుగా సహాయం అందించారు.
ఒకే చితిపై ఏడుగురు దహనం..
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అంతమొందించాలని నెపంతో నైజాం నవాబు, భూస్వాములు, రజాకార్లు, నెహ్రూ సైన్యం ఉమ్మడిగా ఉద్యమకారులుపై దాడులు చేశారు. ఆళ్ళపాడు గ్రామానికి చెందిన యలమందల రామచంద్రయ్య, మంద అచ్చయ్య, వల్లాపురం గ్రామానికి చెందిన గొర్రె ముచ్చు అజరయ్య, మద్ది రాములు, రేపల్లె వాడకు చెందిన మడుపల్లి వీరస్వామి, సామినేని గోపయ్య, తమ్మినేని బుచ్చయ్య గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన మరి కొందరిని పట్టుకొని దళ సభ్యులు సమాచారం చెప్పాలంటూ వివిధ ప్రాంతాల్లో చిత్రహింసలకు గురి చేశారు. రేపల్లెవాడ గ్రామం నుంచి వీరిని ఈడ్చుకుంటూ గోవిందాపురం ఎల్ గ్రామానికి తీసుకు వచ్చారు. దళానికి ప్రధాన కొరియర్ గా వ్యవహరిస్తున్న కొత్తపల్లి కృష్ణమూర్తిని బంధించి సాయుధ పోరాట యోధుల సమాచారం చెప్పాలంటూ నెహ్రూ సైన్యం నైజాం నవాబు సైన్యం చిత్రహింసలకు గురి చేశారు. రేపల్లెవాడ నుంచి నిజాం తుపాకులకు బలైన ఏడుగురు మృతదేహాలను గోవిందా పురం గ్రామం నుంచి ప్రధాన వీధుల గుండా గుర్రాలతో ఈడ్చుకుంటూ తీసుకువచ్చి ఊరిబయట గల మంగళ గుట్టపై ఒకే చితిపై పేర్చి ప్రజల ఎదుటే దహనం చేశారు. ఈ క్రమంలోనే రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారే తప్ప వెనకడుగు వేయలేదు. నిజాం సైనికులు పట్టుకొన్న వారిలో కొత్తపల్లి కృష్ణమూర్తిని మాత్రం ఆ ఏడుగురితో కాల్చకుండా వదిలేశారు. అరే బుడత నువ్వు చాలా ఎర్రగా ఉన్నావ్ రా అంటూ కృష్ణమూర్తిని వదిలేసారు. సీపీఐ(ఎం) గోవిందాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సీపీఐ(ఎం) గోవిందాపురం ఎల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన క్రమం తప్పకుండా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తూ వస్తున్నారు.
అగ్ర నాయకుల సందర్శన...
తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టు అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, మాకినేని బసవపున్నయ్య, సర్వదేవభట్ల రామనాథం, టీవీ విటల్ వంటి నాయకులు మండలాల్లో అనేకసార్లు పర్యటించి కార్యకర్తలలో ధైర్యం నింపారు. 1953లో కమ్యూనిస్టు అగ్రనాయకులు మాకినేని బసవపున్నయ్య అశేషప్రజానీకం మధ్యన గోవిందాపురం లో వీరమరణం పొందిన ఏడుగురిని దహన సంస్కారం చేసిన స్థలంలో నిర్మించిన స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. బ్రాహ్మణపల్లి గ్రామం ఉద్యమానికి ఊపిరి ఊదింది. ఈ గ్రామానికి చెందిన అనేక మంది సాయుధ పోరాటంలో అసువులు బాశారు. మాధవ రెడ్డి ని హత్య చేసిన తర్వాత ఉద్యమం మరింత ఉధృతం అయింది. ఈ గ్రామానికి చెందిన పలువురని రజాకార్ల మూకలు దారుణంగా చంపారు. అప్పట్లో బ్రాహ్మణపల్లి ఉద్యమ కేంద్రంగా మారింది.
హేమాహేమీలకు కొలువైన మండలం
బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లు దళ కమాండర్‌గా గోవిందాపురం గ్రామానికి చెందిన తమ్మారపు గోవిందు, ఏలూరు నరసింహారావు, జొన్నలగడ్డ రామయ్య ఉప కమాండర్లుగా ఇదే గ్రామానికి చెందిన యువకులు తమ్మారపు భద్రయ్య, ఉమ్మినేని ఆదినారాయణ, తుళ్లూరు రత్తయ్య, తుళ్లూరు శంకరయ్య, రావూరి వెంకట రామయ్య, మల్లెల విశ్వనాథన్ బ్రాహ్మణ పల్లి గ్రామంలో గాదె మాధవ రెడ్డి, నల్లమల గోపయ్య, ఆదినారాయణరెడ్డి, పైడిపల్లి జోగయ్య, పారుపల్లి జోగయ్య, మందడపు పిచ్చయ్య, ముష్టి కుంట గ్రామానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన వారు మల్లెల వెంకటేశ్వర్లు నాయకత్వాన అంతర్రాష్ట్ర కృష్ణా జిల్లా వత్సవాయి క్యాంపు ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆ సమయంలో ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమానికి చేయూతనిచ్చింది. ఉద్యమకారులకు కొరియర్‌గా కొత్తపల్లి కృష్ణమూర్తి ఏసుప్రభు జకరయ్య నిమ్మ తోట సీతయ్య ఇంకా అనేకమంది దళాలకు సద్దులు మోసి దళాలను కాపాడారు.