Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జామాయిల్ రైతులకు పెను శాపం
అ న్యాయం కోసం పురుగుమందు
డబ్బాతో ఆందోళనకు దిగిన
రైతు కుటుంబం
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కర్మాగారంలో ప్రైవేటు కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. ఐటీసీలో ఉడ్ యార్డుకు సంబంధించిన కొంతమంది అధికారుల నిర్వహకం, ఉడ్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల జామాయిల్ రైతుల కుటుంబాలు మనోవేదనకు గురౌతున్నాయి. ఉడ్ యార్డుకు సంబంధించిన అధికారులను ఓ కాంట్రాక్టర్ చెప్పు చేతుల్లో పెట్టుకొని జామాయిల్ రైతులను వేధిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. జామాయిల్ కర్ర అమ్మాలంటే ఆ కాంట్రాక్టరుకే విక్రయించాలని లేకపోతే రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అక్కడే వదిలేస్తాడని ఆరోపణలున్నాయి. గిరిజన రైతులతో సహా మోసం చేస్తున్నాడని జామాయిల్ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పాల్వంచ మండలం జగన్నాధపురం చెందిన ఓ రైతు కుటుంబం గురువారం సారపాక ఐటీసీ ఉడ్ యార్డ్ గేట్ ముందు పురుగుల మందు డబ్బాతో గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆ రైతు కుటుంబం పురుగుమందుల డబ్బాతో తనకు జరిగిన అన్యాయం గురించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా ఐటీసీ అధికారులు ఆ రైతుతో చర్చలు జరిపారు. ఉడ్ కాంట్రాక్టరు రైతులను ఏ విధంగా మోసం చేశాడో ఈ విషయంపై సదరు రైతు అధికారులకు వివరించారు. దీంతో జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఐటీసీ అధికారులు ఆ రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.