Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఈ నెల 27న దేశ వ్యాప్తంగా 12 రాజకీయ పార్టీలు తలపెట్టిన భారత్ బంద్‌లో సిఐటియు సంపూర్ణ మద్దతు, ప్రత్యక్ష భాగస్వామ్యం అవుతుందని సిఐటియు రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ పేర్కొన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సోమవారం బండారు యాకయ్య అధ్యక్షతన త్రీటౌన్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, లేబర్ కోడ్లు వంటి ప్రజా వ్యతిరేక చట్టాలు చేసిందని, దేశ ప్రజా సంపదను కారుచౌకగా వేలం పెట్టి కార్పోరేట్లకు ధారాదత్తం చేస్తుందన్నారు. మతోన్మాద విధానాల ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతుందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 27న తలపెట్టిన భారత్ బంద్‌లో సిఐటియు సంపూర్ణంగా పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తుశాకుల లింగయ్య, జిల్లా నాయకులు భూక్య శ్రీనివాసరావు, నాయకులు పాశం సత్యనారాయణ, వేల్పుల నాగేశ్వరరావు, కొట్టె అలివేలు, మండల వీరస్వామి, మీనాల మల్లికార్జున్, మట్టి పల్లి వెంకన్న, చంద్రకాని రాంమూర్తి, ఆంటోని, యర్రా మల్లికార్జున్, తులసి రాం, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.