Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని అఖిలపక్షం నేతలు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) ఎన్డీ, కాంగ్రెస్, టిజెఎస్, తెలంగాణ ఇంటి పార్టీ నేతల సమావేశం స్థానిక గిరిప్రసాద్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, ఎన్డీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, టిజెఎన్ నాయకులు గోపగాని శంకర్రావు, బాబు, ఎంఎల్ ఎన్డి చంద్రన్న వర్గం నాయకులు ఎం.గిరి, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలంగా పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని కార్పొరేట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేవన్నారు. నూటికి 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుందని, దీనికి వ్యతిరేకంగా జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. పోడు రైతాంగం పట్ట రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంభిస్తుందని, పోడు రైతుల పైకి అటవీ అధికారులు, పోలీసులను ఊసిగొల్పి జైలుపాలు చేస్తుందని నాయకులు ఆరోపించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను సైతం గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని, మహిళలు ముఖ్యంగా పసి పిల్లల తల్లులను కూడా జైళ్లకు పంపడాన్ని నిరసిస్తూ పోడు సాగుదారులందరికీ భూ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, కారేపల్లి మండలం చీమలపాడులో పోడు సదస్సులను నిర్వహించాలని సదస్సుకు పెద్ద సంఖ్యలో పోడు రైతులు హాజరు కావాలని సమావేశం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్బంధాలను ప్రతిఘటించేందుకు పోడు. రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయ కులు జమ్ముల జితేందర్‌రెడ్డి, తాటి వెంకటేశ్వరరావు, కొండపర్తి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.