Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
పోడు సాగుదారులపై వేధింపులు ఆపాలని, అర్హులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా ఫారెస్టు ఆఫీసు ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని నీరుగార్చటం కోసం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సుప్రీం కోర్టులో కేసు వేయించిందన్నారు. 1958 అటవీ హక్కుల చట్టానికి సవరణ చేస్తూ, రానున్న కాలంలో అడవులను ప్రైవేటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పెంచాలని నిర్ణయం చేసిందన్నారు. అడవిలో దాగి వున్న కలప, మాంగనీసు, థోరియం వంటి విలువైన ఆస్తులను బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం, టైగర్ జోన్స్ పేరుమీద గిరిజనులను అడవిలో నుండి వెళ్ళగొట్టడానికి సిద్దపడుతుందన్నారు. రాష్ట్రంలో 2,11,973 మందికి సంబంధించి 7,61,061 ఎకరాలు పెండింగ్‌లో వున్నాయన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 81,805 మంది సాగుదారులకు సంబంధించి 3,47,943 ఎకరాలు పెండింగ్‌లో వున్నాయన్నారు. రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు భూ వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్రవ్యాపిత జాయింట్ సర్వేకు ఆదేశించాలన్నారు. గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని చట్టంలో వున్నా ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. 2006 అటవీహక్కుల చట్టం ప్రకారం గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు, గిరిజనేతర కుటుంబాలు పోడు అనుభవదారులుగా 3 తరాలు వున్నట్లు గ్రామ సభ ఆమోదిస్తే ఆ భూమిపై హక్కు పట్టాలివ్వాలని, ఈ పని చేయకుండా పోలీసులను, ఫారెస్టు అధికారులను ఎగదోసి పంట పొలాలను ధ్వంసం చేయడం, బుల్డోజర్తో కందకాలు తవ్వడం, అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపడం దుర్మార్గమ న్నారు. పోడు సమస్యను కుర్చీవేసుకొని కూర్చొని పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి హక్కు పత్రాలివ్వకుండా మోసం చేశారన్నారు. వెంటనే హక్కుదారులందరికీ హక్కు పత్రాలు ఇచ్చి పోడు సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్‌లు మాట్లాడుతూ ఖమ్మంకు కూత వేటు దూరంలో వున్న వెలుగుమట్ల నుండి కొదుమూరు వరకు ఫారెస్ట్ భూమి అని రైతులను భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, గత 3 తరాలుగా వారు ఆ భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని, వారికి హక్కు పత్రాలిచ్చి హక్కు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పోడు రైతులందరికీ రైతుబంధు వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. డిఎఫ్ఓ బి.ప్రవీణకు వినతిపత్రం అందజేశారు. తన పరిధిలో వున్నంత వరకు పరిష్కారానికి సహ కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, రైతు సంఘం నాయకులు షేక్ మీరాసాహెబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, పొన్నెకంటి సంగయ్య, వత్సవాయి జానకిరాములు, బారీ మల్సూర్, కొండ బోయిన నాగేశ్వరరావు, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, బంధం శ్రీనివాసరావు, నాదెండ్ల పుల్లయ్య, జోగయ్య, మంద సైదులు, జాజిరి శ్రీను, రాయల శ్రీనివాస్, వై.విక్రం, బందెల వెంకయ్య పాల్గొన్నారు.