Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
అభివృద్ధి రాజకీయ, వ్యక్తిగత విబేధాలతో గ్రామాల అభివృద్ధి కుంటు పడవద్దని ఎంపీపీ మాలోత్ శకుంతల సూచించారు. కారేపల్లి మండల పరిషత్ సమావేశం ఎంపీపీ మాలోత్ శకుంతల అధ్యక్షతన జరిగింది. ఈ సమా వేశంలో ఎంపీపీ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సర్పంచ్‌లు వార్డు సభ్యులు సమన్వయంతో ముందుకు పోవటం ద్వారా గ్రామాల్లో శాంతియుత వాతావరణంలో అభివృద్ధి సాధించగల్గుతామన్నారు. కారేపల్లి మోడల్ స్కూల్ వెళ్ళు రహదారి అధ్వానంగా తయారైందని ఎస్సీ, ఎస్టీ క్రింద ఆ రహదారికి నిధులు మంజూరైనా పనులు చేయించటంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని జడ్పీటీసీ వాంకుడోత్ జగన్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన సర్పంచ్ స్రవంతి వార్డు సహకరిం చటం లేదని సభ దృష్టికి తీసుకవచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీపీ ప్రజల సహకారంతో అభివృద్ధి సాధించాల న్నారు. కారేపల్లి పెద్దచెరువు శిఖం భూమి అక్రమణకు గురవుతుందని అలుగును సైతం ధ్వంసం చేసి ఆక్రమించుకుంటున్నా ఏమి చేస్తున్నారని ఇరిగేషన్ ఏఈ హబీబ్‌ను కారేపల్లి సర్పంచ్ ఆదెర్ల స్రవంతి ప్రశ్నించారు. పంచా యతీలో 60 విద్యుత్ స్తంభాలు అవసరమైన విద్యుత్ అధికారులకు తెల్పిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కోఆప్షన్ ఎండీ.హనీఫ్ మాట్లాడుతూ మండలంలో ఆర్ అండ్ బీ రహదారులు అధ్వానంగా తయారైనాయని ఇల్లందు- డోర్నకల్ రోడ్ నాల్గేండ్లు ఆయినా పూర్తి కాలేదని అగ్రహం వ్యక్తం చేశారు. గేటుకారేపల్లి - రామకృష్ణాపురం బీటీ రోడ్డు అర్ధంతరంగా ఆగిపోవటంతో కంకర వేసిన రహదారిపై ప్రజలు అవస్ధలు పడుతూ ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీనిపై ఐటీడీఎ ఏఈ మాట్లాడుతూ గుత్తేదారు బీడీ రోడ్డు పనులను మధ్యలో నిలిపేసి పోయాడని ఆ రహదారి పనులకు రీ టెండర్ పిలుస్తున్నట్లు తెలిపారు. సింగరేణి మండలంలో మొదటి విడుత రైతు బంధు 11261 మంది రైతులకు రూ. 15.88 కోట్లు విడుదలైనట్లు ఏవో కే.ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. వైద్య శాఖ సమీక్షలో వైద్యురాలు డాక్టర్ చందన మాట్లాడుతూ మూడు నెలల కాలంలో మండలంలో 28 డెంగ్యూ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయటం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5179 మందిలో ఇప్పటి వరకు 80 శాతం మందికి పుస్తకాలు పంపిణి జరిగిందన్నారు. పోలంపల్లి ప్రాధమిక పాఠశాలకు పక్కా భవనం లేక రేకులషెట్టు చెట్ల క్రింత చదువులు సాగుతున్నాయని తక్షణమే ఆ పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, తహసీల్ధార్ డీ.పుల్లయ్య, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.