Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చర్ల
మావోయిస్టు పార్టీ 17వ వార్షికోత్సవాలకు సన్నద్ధమైంది. గతంలో లో పీపుల్స్‌వార్‌గా ఉన్న మావోయిస్టు పార్టీ 21 సెప్టెంబర్ 2004న మావోయిస్టు పార్టీగా పేరు మార్చుకుంది. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు వారం రోజులపాటు పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. అదే క్రమంలో ఈనెల 27న జరిగే భారత్ బంద్‌కి మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ మేరకు మీడియాకి లేఖలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కి సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఏజెన్సీలోని చర్ల, దుమ్మగూడెం మండలాలతోపాటు ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో పోలీసులు అప్రమత్తమైనారు. మావోయిస్టుల కదలికలపై పోలీసు నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి.
చర్ల సీఐ బి. అశోక్, ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టులకు కంచుకోటలాంటి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర దండకారణ్య గ్రామాలకు రాకపోకలు సాగించేవారిపై డేగకన్ను వేసి ఉంచారు. ఇదిలా ఉండగా హింసాత్మక చర్యల వలన ఆదివాసీలకు జరుగుతున్న నష్టాలను వివరిస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్ల,మండలంలో ఆదివాసీ సంఘాల పేరుతో ఇటీవల కరపత్రాలు వెలిసిన విషయం విదితమే.
మావోయిస్టు పార్టీ సమావేశాలకు హాజరు కావద్దు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్
మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో నిర్వహించే సమావేశాలకు ప్రజలెవరూ హాజరు కావద్దని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 21న మావోయిస్టులు నిర్వహించే మీటింగ్‌కు ప్రజలు తరలిరావాలని మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు చర్ల మండల బోర్డర్ అటవీ ప్రాంతాలైన చెన్నాపురం, ఎర్రంపాడు, బత్తినిపల్లి, భట్టిగూడెం, ఆర్సీ పురం, కుర్నపల్లి, బోదనెల్లి కొండెవాయి గ్రామాలలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. తప్పనిసరిగా సమావేశానికి రావాలని హుకూం జారీ చేసి మావోయిస్టులు అమాయక ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. మీటింగ్‌కు వచ్చేటప్పుడు బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు తీసుకురావాలని, ఒకవేళ రాకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు పార్టీ చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టిపరిస్థితుల్లో ఆదివాసీ ప్రజలు సహకరించరాదని ఎస్పీ సునీల్‌దత్ విజ్ఞప్తి చేశారు.