Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
కేంద్ర ప్రభుత్వం 2002లో దేశంలో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎందరో నిరుపేద విద్యార్ధుల కడుపులు నింపగా, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల వారికి అన్నం పెట్టే డొక్కలు మాత్రం ఎండుతున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించక, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంచకపోవడంతో ఏజెన్సీలు అప్పుల పాలవడమే కాకుండా రోజూ 150 మంది విద్యార్ధులకు అన్నం పెట్టే చేతులు తమ కడుపులను నింపుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా తమ వైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదని ఆవేదనతో నేడు దేశవ్యాప్తంగా ఈ స్కీం వర్కర్లు నిరసనకు దిగుతున్న నేపధ్యంలో కార్మికులను 'నవతెలంగాణ' పలకరించగా విస్తుపోయే వాస్తవాలు తెలిపి కన్నీరుమున్నీరయ్యారు.
అప్పుల భారం, అ'గౌరవ' వేతనం.....
చాలీచాలని గౌరవ వేతనాలు, సకాలంలో చెల్లించని బిల్లులు కార్మికులకు ఉన్న ప్రధాన సమస్యలుగా వారు చెప్పుకొచ్చారు. కట్టెల దగ్గర నుంచి చివరాకరున వేసే కరివేపాకు వరకూ మొత్తం వర్కర్లు కొనుగోలు చేసి విద్యార్ధులకు వంటలు చేసి పెడుతుండగా రాష్ట్ర ప్రభుత్వ కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వలన అప్పులు తెచ్చి వండిన ఏజెన్సీలపై అప్పుల భారం పడుతుంది. పైగా బిల్లుల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం వలన వడ్డీ కూడా అంతకంతకూ పెరుగుతూ తమ నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల బిల్లులోని పూర్తి మొత్తం కూడా విడతల వారీగా చెల్లిస్తుండడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఇంత చేసినా నెలకు రూ.1000 గౌరవ వేతనం ఇవ్వడం తమను మరింత ఆందోళనకు గురిచేస్తుం దన్నారు. చాలీచాలనీ గౌరవ వేతనాలతో ఇండ్లు ఎలా గడవాలని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకవేళ ఈ పని తరువాత ఏదైనా కూలీపనికి వెళదామంటే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పాఠశాలల్లోనే సరిపోతుందని దీంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు 2019 ఆగష్టు నుంచి 2019 నవంబర్ వరకూ బిల్లులు చెల్లింపుల్లేవు. అప్పులు తెచ్చి వండిపెట్టిన తమకు లాక్డౌన్ ఓ నరకయాతనను మిగిల్చిందని కన్నీరుమున్నీర య్యారు. చిత్రమేమిటంటే 2019 బిల్లులు ఇంతవరకూ చెల్లించకపోవడం గమ నార్హం. 2017లో కేంద్ర ప్రభుత్వం రూ.5000 గౌరవ వేతనం కల్పిస్తామని ప్రకటించినా ఇంత వరకూ ఆచరణలో పెట్టలేదని మండిపడ్డారు.
హవ్వ.. ఇవేం మెనూ ఛార్జీలు......
ఇక మెనూ ఛార్జీల విషయానికొస్తే ప్రభుత్వం ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి విద్యార్ధులకు ప్లేటుకు రూ.4.13, 6 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ప్లేటుకు రూ.8.18 చెల్లిస్తుంది. పెరిగిన ధరలకు ఇది ఎంత మాత్రం సరిపోదని, పైగా ప్రభుత్వం వారానికి మూడు సార్లు గుడ్లు వండిపెట్టాలని ఆదేశించిందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం గుడ్డు ధర రూ.5.50 ఉంది. గుడ్డు ధరే రూ.5.50 ఉంటే మెనూ ఛార్జి రూ.4.13 ఇస్తూ పైగా వారానికి మూడు సార్లు ఏ విధంగా పిల్లలకు వండి పెట్టాలని వాపోతున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల
ప్రధాన డిమాండ్లు....
నెలకు రూ.21,000 గౌరవ వేతనం ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తమకు కూడా గుడ్లు ఉచితంగా సరఫరా చేయాలి. వంట గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేయాలి. పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేసి, వంట గదులు, వంట పాత్రలు, మినరల్ వాటర్ సరుపాయాలు కల్పించాలి. పధకం కింద పనిచేసే కార్మికులకు సంవత్సరానికి నాలుగు జతల యూనిఫారం ఇవ్వాలి. ఈ పధకం కింద పనిచేసే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, భీమా సౌకర్యం కల్పించాలి. వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలి. ఒక బిల్లులోని పూర్తి మొత్తాన్ని విడతల వారీగా కాకుండా ఒకే ధఫాలో విడుదల చేయాలి.
ఇదే విధంగా కొనసాగితే వేరే వృత్తి చూసుకుంటాం.....
పూచి సీత, గర్ల్స్ హైస్కూల్, సత్తుపల్లి
ఇన్నాళ్లూ ఓపిక పట్టాం. ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి మారకపోతే ఇక ఈ వృత్తికి స్వస్థి పలుకుతాం. ఇప్పటికే చాలా అప్పుల పాలయ్యాను.
సరుకులన్నీ ప్రభుత్వమే ఇస్తే మాకు ఈ బాధలుండవు......
కొత్తపల్లి జరీనా, బార్సు హైస్కూల్, సత్తుపల్లి
బియ్యం ఇస్తున్నట్లే వంట సరుకులన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తే చక్కగా వండిపెడతాము. మేమే కొనుక్కొచ్చి, వండి పెడుతున్నాం. సకాలంలో బిల్లులు అందక నానా అవస్థలు పడుతున్నాం.
నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్నాం...
బి.రాములు, మండల విద్యాశాఖ అధికారి, సత్తుపల్లి
నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్నాం. మంజూరు కాగానే బకాయిలు చెల్లిస్తాం. గత ఫిబ్రవరి, మార్చి నెల బిల్లులు చెల్లించడం జరిగింది.