Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల, విద్యార్థులకు సరైన విద్యాభ్యాసం అందడం లేదని, హైస్కూల్లలో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యల సాధనకు ఉపాధ్యాయులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. బుధవారం జిల్లాలోని పలు పాఠశాలలు సందర్శించి విద్యారంగ సమస్యలు తెలుసుకున్న నర్సిరెడ్డి రాత్రి టీఎస్ యుటిఎఫ్ బృందంతో కలిసి జిల్లా కలెక్టర్ తో విద్యారంగ సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చేసిన వర్కుఅడ్జస్ట్ మెంట్ డిప్యుటేషన్లను రద్దు చేసి, ఖాళీలలో విద్యావాలంటీర్లను నియమించి, విద్యార్థుల విద్యాభ్యాసంనకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు. కోవిడ్ నేపధ్యంలో పాఠశాలల పరిశుభ్రత కీలకమైనదని, పరిశుభ్రత కోసం స్కావెంజర్స్‌ను నియమించుటకు యంపిడిఓ, గ్రామ కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ని కోరారు. పదిహేడు శాతం ఇంటి అద్దె అలవెన్సుల మంజూరు కోసం జారీ చేసిన జాబితా తప్పులతడకగా ఉందని, జాబితా నిలుపుదల చేసి సరైన విధంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ సరిహద్దులు మారినప్పుడు మాత్రమే దూర నిర్దారణ చేసి జాబితా రూపొందించాలని కలెక్టర్‌ని కోరారు. సమస్యలపై చర్చించిన పిదప జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌ను కలిసి చర్చించిన వారిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో పాటు టియస్ యుటియఫ్ నాయకులు చావ దుర్గాభవాని, జివి.నాగమల్లేశ్వరరావు, మంగీలాల్, సురేష్, శ్రీకాంత్ తదితరులున్నారు.