Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
అవినీతి ఆరోపణలు రుజువై, క్రిమినల్ కేసు నమోదైన ఏదులాపురం సహకార సంఘం ఛైర్మన్ ఏనుగు ధర్మారెడ్డినివెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తు సంఘం డైరక్టర్లందరూ గురువారం సంఘం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఏదులాపురం సహకార సంఘంలో అవినీతి ఆరోపణలపై సంఘం డైరెక్టర్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ జరిపి ఆరోపణలు రుజువు కావడంతో ఛైర్మన్ ధర్మారెడ్డి, సీఈవో నరసింహారావులతో పాటుగా మరో 25 మందిపై పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్లో ఇటీవల క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. క్రిమినల్ కేసులకు ముందే సీఈవోను అధికారులు సస్పెండ్ చేశారు. కూసుమంచి మండలం కల్లూరిగూడెం సహకార సంఘం ఉద్యోగి మహ్మద్ అలీని సీఈవోగా నియమిస్తు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అ యితే సీఈవో జాయిన్ కావడానికి పాలకవర్గ తీర్మానం తప్పనిసరి దీంతో గురువారం పాలకవర్గ సభ్యులు సమావేశం అయ్యారు.దీనికి డీసీవో విజయకుమారి హాజరయ్యారు. చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని డీసీవో చెప్పగా డైరక్టర్లందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు రుజువు అయి, క్రిమినల్ కేసులు నమోదు అయితే ఇంకా చైర్మన్‌ను తొలగించ కుండా వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. చైర్మన్‌ను తొలగించాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. డీసీవో కారును అడ్డుకొని కారు ఎదురుగా బైఠాయించారు. సంఘం కార్యకలాపాలు నిర్వహించి, సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. వెంటనే వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ సహకార సంఘం కార్యాలయానికి వస్తే డైరెక్టర్లు అందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. చైర్మన్‌ను తొలగించే బాధ్యత తమ పరిధిలో లేదని జిల్లా ఉన్నతాధికారులకు సమస్యను తెలియజేస్తానని డిసిఓ తెలిపారు. ఈ లోగా ఎస్సై శంకర్ రావు తన సిబ్బందితో సంఘం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. డిసిఓ, డైరెక్టర్లతో మాట్లాడారు. చైర్మన్ సంఘం కార్యాలయానికి రాకుండా ఉంటేనే ఆందోళన విరస్తామని డైరెక్టర్లు తేల్చి చెప్పారు. దీనికి డిసిఓ అంగీకరించారు. దాంతో డైరెక్టర్లు ఆందోళన విరమించారు. ఆందోళనలో వైస్ చైర్మన్ ఉరడీ హైమావతి, డైరెక్టర్లు అల్లిక వెంకటేశ్వరరావు, జర్పుల లక్ష్మణ్ నాయక్, యడ్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.