Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వ్యవసాయేతర రుణాలు పొందిన 22 మందిపై చర్యలు తీసుకోనున్నట్లు స్వయంగా డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. ఎన్నెస్టీ బ్రాంచి నుంచి 20 మంది, రోటరీనగర్ శాఖ నుంచి ఒక్కరు, ప్రధాన కార్యాలయం నుంచి మరొకరు మొత్తం 22 మందిపై చర్యలు తీసుకోవాలని బోర్డు మీటింగ్, మహాజన సభలో తీర్మానించామన్నారు. గత పాలకవర్గం హయాంలోని 2016లో ఒక్కొక్కరు రూ.20 లక్షల చొప్పున 22 మంది రూ.4 కోట్లు తిరిగి చెల్లించకపోవడంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. రాజకీయ అవసరాల కోసం అప్పుడప్పుడూ తుట్టె కదుపుతున్నట్లు చేస్తున్నారే తప్ప ఎలాంటి పురోగతి లేదు.
- ఆ నలుగురి సంగతేంటి?
నకిలీ ధ్రువీకరణల ఆధారంగా రుణాలు పొందిన 22 మందిలో 14 మందిపై టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎన్నెఎస్టీ శాఖ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిపై విచారణ కూడా పూర్తయినట్లు సమాచారం. 2016లో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై 14 మంది తమకు విలువైన పాట్లు ఉన్నట్లు నకిలీ ధ్రువీకరణపత్రాలు సమర్పించి 3.06కోట్ల మార్టిగేజ్ రుణాలు పొందారు. తాజాగా ఇదే బ్రాంచీలో మరో నలుగురు కూడా నకిలీ పత్రాలతో రూ.కోటికి పైగా రుణాలు తీసుకున్నట్లు బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ శనివారం నిర్ధారించింది. ఈ నలుగురిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాలకవర్గానికి సిఫారసు చేశారు. ఈ బ్రాంచి నుంచే మొత్తం రూ.4.5 కోట్ల వరకు నకిలీ ధ్రువీకరణలతో రుణాలిచ్చినట్లు సమాచారం. ఇలా నకిలీ ధ్రువీకరణలతో రుణం పొందిన వారిలోమిగిలిన నలుగురి సంగతేంటి అనేది ప్రశ్నగా మిగిలింది. అయితే రుణాలు ఇచ్చిన సమయంలో ఉన్న ముగ్గురు అధికారులు ఉద్యోగ విరమణ పొందగా మరో ముగ్గురు ఇతర బ్రాంచీల్లో పనిచేస్తున్నారు.
- మూడేళ్ల క్రితం వైరా బ్రాంచిలోనూ కొందరి డిపాజిట్లను గల్లంతు చేశారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో కొంతమేర రికవరీ చేశారు.
- తల్లాడ సహకారసంఘం సీఈవో నిర్వాకం...
తల్లాడ సహకార సంఘంలో రైతులు పంట రుణాలు తీసుకుని తిరిగి చెల్లించారు. రుణాలు చెల్లించినట్లు రశీదులు కూడా పొందారు. కానీ ఇంకా బాకీ ఉన్నట్లు సొసైటీ ఆ రైతులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రైతులు ఆందోళన తెలపడంతో సొసైటీ సీఈవో రూపే కార్డు (ఏటీఎం)లను కొందరు రైతులకు ఇవ్వకుండా ఆ కార్డుల ఆధారంగా అక్రమాలకు పాల్పడిసస్పెండ్ అయ్యాడు.
- ధాన్యం కొనుగోళ్లలోనూ అవకతవకలు
ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ సొసైటీలు అక్రమాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం సహకార సంఘంలో మామిడి, ఆయిల్‌ఫాం వేసిన భూముల్లో వరి పండించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ నిర్వహించి ఆ సొసైటీ సీఈవోను సస్పెండ్ చేశారు.సత్తుపల్లి మండలం కాకర్లపల్లి, చింతకానిలోనూ ఈ రకమైన అవకతవకలే వెలుగుచూశాయి. రైతులకు చెల్లించాల్సిన సొస్మును కేంద్రాల నిర్వాహకులే కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రతీ సొసైటీ అవినీతి అక్రమాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏదులాపురం సొసైటీ అవకతవకల వెనుక ఈ తరహా చర్చ అధికంగా నడుస్తోంది.