Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సెకండ్ ఫ్లోర్ పైనున్న నీటి ట్యాంకులు లీక్
అ భవనం పైనుంచి కింది వరకు ఎక్కడ తాకినా 'షాక్'
అ గత కమిషనర్‌కు మొరపెట్టుకున్నా నిష్ప్రయోజనం
నవతెలంగాణ- గాంధీచౌక్
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయ భవనం సైతం 'పేదరికం'లోనే మగ్గుతోంది. రోజుకు వందలాది పేదలు ఈ భవనంలోని మెప్మా ఆఫీస్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చిపోతుంటారు. అటువంటి ఈ భవనంలో ఎక్కడ తాకినా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ అవుతుంది. కారణం భవనం పూర్తిగా దెబ్బతినడం ఒకటైతే అతిప్రధానంగా రెండో అంతస్తు పైనున్న నీటి ట్యాంకులు లీకవుతున్నాయి. ఇలా లీకవుతున్న నీటి తేమకు స్లాబ్‌లు, గోడలు చెమ్మ దిగి నానుతున్నాయి. ఈ నీరు విద్యుత్ పైపుల్లోకి వెళ్తుండటంతో ఏ గోడ తాకినా ఎర్త్ అవుతోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓల్డ్ ప్రెస్‌క్లబ్ ఉన్న స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. పై రెండు అంతస్తులు మెప్మా కార్యాలయానికి వినియోగిస్తున్నారు. కింది ఫ్లోర్‌ను మాత్రం కిరాయిలకు ఇస్తున్నారు. మొత్తం ఐదు దుకాణాలకు అద్దెకు ఇచ్చారు. ఒక్కో షాపు నుంచి నెలకు రూ.5,000 వరకు రెంట్ వసూలు చేస్తున్నారు. మొత్తం పది గదుల అద్దెలు రూ.50వేల వరకు దుకాణదారులు నగరపాలక సంస్థ అకౌంట్లో జమ చేస్తున్నారు. కానీ ఈ భవనం బాగోగులు మాత్రం కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. నీటి చెమ్మ దిగకుండా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. తద్వారా మెప్మా ఆఫీస్‌లోని ఫైల్స్, కంప్యూటర్ సామగ్రి, కింద ఉన్న బీఎస్ఎన్ఎల్ సర్వీసింగ్ సెంటర్లోని కంప్యూటర్లు, కేబుల్స్, విద్యుత్ పరికరాలు, పరుపుల కొట్టులోని పరుపులు, టీవీ రీపేర్ సెంటర్లోని టీవీలు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలా అన్నింటికీ తేమ వ్యాప్తి చెందడంతో తరచూ షార్ట్‌సర్క్యూట్ అవుతోంది. బీఎస్ఎన్ఎల్ సర్వీసింగ్ సెంటర్లో సీలింగ్ తడిచి నేలరాలుతోంది.
- పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు
నగర పాలక సంస్థ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయ భవనం నీటి చెమ్మ కారణంగా శిథిలావస్థకు చేరుతుందని పలుమార్లు మెప్మా అధికారులు, సిబ్బంది, కింద ఉన్న దుకాణదారులు గత కమిషనర్ అనురాగ్ జయంతి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. మెప్మా అధికారులను కింద ఉన్న దుకాణదారులు ప్రశ్నిస్తే 'మాకేం సంబంధం..' అనే రీతిలో సమాధానం ఇస్తున్నారు. 'గట్టిగా అడిగితే మీతోపాటు మేమూ ఇబ్బంది పడుతున్నాం' అంటున్నారు. నిత్యం వందల సంఖ్యలో డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు, వీధి వ్యాపారులు ఈ కార్యాలయానికి వచ్చిపోతుంటారు. పొరపాటున గోడలను తాకితే విద్యుదాఘాతానికి గురవుతున్నామని వారు వాపోతున్నారు. దీనిపై మెప్మా సూపరింటెండెంట్ శ్రీదేవిని 'నవతెలంగాణ' వివరణ కోరగా...డీఈ, ఏఈలు పరిశీలించారు. ట్యాంకులు లీక్ కాకుండా మరమ్మతులు చేయిస్తామన్నారు అని తెలిపారు. నూతన కమిషనర్ ఆదర్శ్ సురభి అయినా దీనిపై దృష్టిపెట్టి మరమ్మతులు చేయించాలని దుకాణదారులు, మెప్మా ఆఫీస్ సందర్శకులు కోరుతున్నారు.