Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
గులాబ్ తుఫాన్ తాకిడికి మానుకోట అతలాకుతలమైంది. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 10 గంటల వరకు మానుకోటలో వర్షం కుంభవృష్టిగా కురిసింది. రహదారులు చెరువులను తలపించాయి. మానుకోట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాల రాకపోకలు స్తంభించాయి. తాళ్ల సంకీస వద్ద రహదారి కల్వర్టుపై నుంచి నీరు పొంగిపొర్లాయి. మహబూబాబాద్ నుంచి అయోధ్య మడుగులు తాళ్లపూసపెల్లికి వెళ్లే రహదారి స్తంభించిపోయింది. అయోధ్య కల్వర్టుపై నుంచి నీళ్లు ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. మహబూబాబాద్-తొర్రూరు రహదారిలో రావిరాల వద్ద కల్వర్టుపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కష్ణ, గోల్కొండతోపాటు అన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 1960 చెరువులు పొంగిపొర్లాయి. మానుకోటలో డ్రెయినేజీలు పొంగి రోడ్లపై నీరు ప్రవహించింది. జిల్లాలోని ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు పొంగిపొర్లాయి. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చెరువులు, వాగులను పర్యవేక్షించారు. మహబూబాబాద్ మండలంలోని వేములూరు గ్రామంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మతి చెందాయి. జిల్లావ్యాప్తంగా 54.48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 94.8 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.
బయ్యారం : ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. రైతు కూలీల పనులకు ఆటంకం ఏర్పడింది. పెద్దచెరువు 2 అడుగుల ఎత్తులో మత్తడి పోస్తోంది. చింతోనిగుంపు, పెద్దగుట్ట, ఏడు బావులు జలపాతాల వద్ద సందర్శకుల రాకపోకలను అధికారులు నిషేధించారు. మోట్లతిమ్మాపురం సమీపంలోని రాళ్లయేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వెళ్లే జాతీయ ప్రధాన రహదారిలోని నామాలపాడు జిన్నెలవాగుపై ఉన్న డౌన్ వంతెన వద్ద నీటి ఉధతి ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పాకాల యేరు, అలిగేరు ఉధతంగా ప్రవహిస్తున్నాయి.
గార్ల : భారీ వర్షాలకు రాంపురం సమీపంలో పాకాల చెక్‌డ్యామ్‌పై వరదనీరు పరవళ్లుతొక్కడంతో రాంపురం, మద్దివంచ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు, డోర్నకల్, కురవి మండలాలకు చెందిన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీతంపేట సమీపంలోని గార్ల పెద్ద చెరువుకు బయ్యారం చెరువు అలుగు ద్వారా ఎర్ర కాలువ నుంచి భారీగా వరదనీరు చేరి మత్తడిపోస్తోంది. గిన్నెవాగు వరదనీటితో కొండలమ్మ చెరువు, పుల్లూరు పెద్ద చెరువు, అప్ప సముద్రం, గండి చెరువు సహా పలు చెరువులు, కుంటలు భారీగా నీరు చేరి అలుగు పోస్తున్నాయి. పలు ప్రాంతాలలో వరి, మిర్చి, పత్తి పంటలు నీట మునిగాయి. పాకాల చెక్ డ్యాం వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై బాదావత్ రవి నాయక్, సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ భారీ కేడ్లు ఏర్పాటు చేయించారు.
గూడూరు : మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఎంపీఓ ప్రసాద్‌రావు బొద్దుగొండ, అప్పరాజుపల్లి, గోవిందపురం గ్రామాల సమీపంలోని కల్వర్లు వద్ద వరద పరిస్థితిని సమీక్షించారు.