Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
- కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్
వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు 90632 11298 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, నగర కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి సోమవారం టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. అధికారులు స్థానికంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
- ఉప్పొంగుతున్న వాగులూ వంకలు...
ఖమ్మం పట్టణ సమీపంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రఘునాథపాలెం మండలంలో బుగ్గవాగు ఉధృతికి పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రుపాలెం మండలం మామునూరు అయ్యవారిగూడెం గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు మీదుగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల మండలం పల్లిపాడులో డబుల్ బెడ్రూం ఇండ్లను వరద నీరు చుట్టు ముట్టడంతో అక్కడ నివసించే వారిని పంచాయతీ ట్రాక్టర్ ద్వారా మైదాన ప్రాంతాలకు తరలించారు. కల్లూరు మధిర రహదారి మధ్య వాగులు పొంగుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వైరా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 20.8 అడుగులకు చేరి అలుగు పారుతోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వైరాలో 127 మి.మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. తల్లాడ పట్టణంలో పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వరదలు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 30.7 అడుగులకు చేరింది. రామాలయ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. బూర్గంపాడు మండలంలో కడియాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నెల్లిపాక బంజర - భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లపల్లి మండలం రాయిపాడు గ్రామం వద్ద కిన్నెరసాని వాగు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది.
- చర్ల మండలం ఈత వాగు, జెర్రిపోతుల వాగు, పూసు వాగు, పగిడి వాగు ప్రమాద స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు 17 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సుమారు 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ డీఈఈ తిరుపతి తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 74 మీటర్లు కాగా 72 మీటర్లకు నీరు చేరింది. దుమ్ముగూడెం మండలం నుంచి మారాయిగూడెం, రాయిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
- పాల్వంచ కిన్నెరసాని పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 405.40లకు చేరింది. ఇన్ ఫ్లో 50,000 క్యూసెక్కులు కాగా ఎనిమిది గేట్లు ఎత్తి 47,000 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీచేశారు. తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు.