Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తుపల్లి : గులాబ్ తుఫాను ప్రభావంతో సత్తుపల్లిలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన వర్షం 8 గంటల వరకూ కుండపోతగా కురవగా, సాయంత్రం వరకూ విరామం లేకుండా తేలకపాటి జల్లులు కురిశాయి. ఉదయం కురిసిన భారీ వర్షానికి సత్తుపల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. పట్టణంలోని రాజీవ్‌కాలనీ, బైపాస్ రోడ్డు, వేంసూరు రోడ్డు, జవహర్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు నీటమునిగి పలు చోట్ల వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
95.2 మిల్లిమీటర్ల వర్షపాతం
కారేపల్లి : కారేపల్లి మండంలో ఆదివారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి పొర్లిపోతున్నాయి. వాగు పొంగి రహదారుల మీది నుండి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. సోమవారం పేరుపల్లి నుండి మాధారం రహదారిపై బుగ్గవాగుపై నిర్మించిన వంతెనపై నుండి వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహించింది. తొడితలగూడెం, గాదెపాడు పెద్దచెరువులు అలుగు నీరు లోవెల్ బ్రిడ్జి నుండి పొంగిపోతున్నాయి. అనంతారంతండాకు వెళ్ళ మార్గంలో వాగు పొంగటంతో బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. సంబంధిత సర్పంచ్‌లు చర్యలు చేపట్టారు. బుగ్గవాగు పక్కనే పేరుపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉండటంతో ఆ ప్రాంతానికి నీరు చేరుకోవటంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం 95.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పొంగు తున్న వాగులను, రహదారుల పరిస్థితిని కారేపల్లి తహసీల్ధార్ డీ.పుల్లయ్య, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పీ.సురేష్, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్‌లు అజ్మీర నాగేశ్వరరావు, బానోత్ మారుసక్రు, బానోత్ కుమార్, ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, ఉపసర్పంచ్ బుడిగ ప్రభాకర్, కార్యదర్శి భూక్యా నిరంజన్లు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.
నీటమునిగిన పంటలు
కొణిజర్ల : ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు కురిసిన వర్షానికి అనేక వాగులు, ఏర్లు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఉదయం నుంచి మండలంలోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్లిపాడు నుంచి ఏన్కురు వెళ్ళే రహదారి మధ్యలో తీగలబంజర సమీపంలో గల పగిడేరు వద్ద ఇసుక లారీ వరద ఉధృతికి బోల్తా పడింది. అక్కడే ఉన్న స్థానికులు తాడు సహయంతో డ్రైవర్ని ఒడ్డుకు చేర్చారు. అంజనాపురం సమీపంలో గల నిమ్మవాగులు ఉధృతంగా వంతెనపై నుంచి ప్రవహిస్తున్నాయి. దీంతో పల్లిపాడు, ఏన్కురు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మల్లుపల్లి సమీపంలో వాగు పొంగి ప్రవహించటంతో రామనర్సయ్య నగర్, మల్లుపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వందలాది ఎకరాలు పత్తి, వరిపొలాలు నీట మునిగాయి. కాత, పూత దశలోఉన్న పత్తి చేలల్లో నీరు నిలిచి ఉండటం వల్ల పూత రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపిలేని వర్షానికి ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు.
వర్షపు నీటితో జలమయమైన
రోడ్లు, గ్రామాలు
బోనకల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలలోని అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఖమ్మం బస్టాండ్ సెంటర్లో వర్షపు నీటితో రోడ్లు నిండిపోయాయి. గ్రామాలలోని అంతర్గత రోడ్ల పై నుంచి వరద నీరు ఉధృతంగా పోతున్నాయి. మండల కేంద్రంలో అనేక ఇళ్లు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వర్షపు నీరు చేరాయి. చిన్న బీరవల్లి వాగు, పెద్దబీరవల్లి కొత్త రోడ్డు, కలకోట వాగు వర్షపు నీటితో మునిగిపోయాయి. పంట పొలాలలో వర్షపు నీరు చేరింది. వర్షాలతో జనజీవనానికి ఆటంకంగా మారింది.
మునిసిపాలిటీ నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్న
డ్రైనేజీ వ్యవస్థ
వైరా : ఆదివారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వైరా పట్టణంలో మెయిన్ రోడ్డు, చిన్న రోడ్లు తేడా లేకుండా జలమయమైనవి. రోడ్లన్నీ జలమయమై ఇళ్లలోకి నీరు చేరి జనం ఇబ్బందులకు గురయ్యారు.వైరా మెయిన్ రోడ్ లో డ్రైనేజీలు లేనందు వలన రోడ్డు పైనే గంటల తరబడి నీరు నిల్వ ఉన్నది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు పక్కన ఉన్న రామాలయంలోకి నీరు చేరింది. 12 వ వార్డులో తీవ్ర సమస్యగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు మునిసిపల్ అధికారులు పరిష్కరిస్తామని చెప్పటం తప్ప చేసింది లేదు. ఆ వీదులన్నీ జలమమయమై మరో వైరా చెరువుని తలపిస్తున్నట్లుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరాలో 127 మి.మి వర్ష పాతం నమోదైంది. ఇరుకు రోడ్లు, అస్తవ్యవస్త డ్రైనేజీలతో ఉన్న 5, 6 వార్డులు సుందరయ్య నగర్, లీలా సుందరయ్య నగర్లో ఖాళీ ప్లాట్లన్నీ నీళ్ళు నిండి పోయి ఉన్నవి. వైరా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా,భారీ వర్షాలకు మరోసారి నిండి 20.8 అడుగులకు చేరుకుంది.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం
ఖమ్మం : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్ధానిక పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. అదేవిధంగా చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో పెట్టుకొని వంతెనలు, చాప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటుదని, రోడ్డు రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు ఆదేశించారు. రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.