Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- బోనకల్
యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ముండ్లపాట విజయనిర్మల తెలిపారు. రావినూతలలోని రైతు వేదిక నందు వ్యవసాయ, ఉద్యానవన పంటలపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువు, కాలువల కింద నీరు ఎప్పటికీ నిల్వ ఉండే భూముల్లో, లోతట్టు ప్రాంతాలలో పంట మార్పిడికి అవకాశం లేనట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే స్వల్పకాలిక లేదా మధ్యకాలిక వరి రకాలు వేసుకోవాలని రైతులకు సూచించారు. వరి కోత అనంతరం దుబ్బ, ఇసుక చల్కా నేలల్లో నీటి సౌకర్యం ఉంటే ఆరు నుంచి ఎనిమిది నీటి తడులు ఇవ్వగలిగిన రైతులు వేరుశనగ పంటను సాగు చేసుకోవాలని కోరారు. మూడు నుంచి నాలుగు తడులు ఇవ్వగలిగిన రైతులు నువ్వులు, ఆవాలు, పెసర, మినుము, బొబ్బర్లు, సజ్జలు, జొన్న పంటలు వేసుకోవాలని కోరారు. వరి కోతలు పూర్తయిన తర్వాత వెంటనే నవంబర్ నెలలో నల్లరేగడి భూముల్లో శెనగ వంటి పంటలు నీటి తడులు అవసరం లేకుండా సాగు చేసుకోవచ్చు అని తెలిపారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలను నీటి తడులుతో పండించు కోవచ్చు అని సూచించారు. ఉద్యానవన పంటలలో ప్రస్తుతం పామ్ ఆయిల్ సాగుకి ప్రాముఖ్యత సంతరించుకుందని మార్కెట్లో మంచి డిమాండ్ కూడ ఉందన్నారు.శిక్షణా తరగతులలో మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు మందడపు తిరుమలరావు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఉప సర్పంచి బోయినపల్లి పెద్ద కొండలు, ఎంపిటిసి కందిమల్ల రాధ, మండల వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు, మండల రైతు బంధు సమితి సభ్యులు బంధం శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారి తేజ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.