Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బోనకల్
కొత్త రేషన్‌కార్డులు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ అందిస్తామని ప్రకటించినప్పటికీ రెండు నెలలు గడుస్తున్నా బియ్యం పంపిణీ జరగడం లేదు. ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన తేవడంతో అర్హులైన వారిలో ఆశలు చిగురించాయి. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, అర్హులైన లబ్దిదారుల జాబితాను అధికారులు సిద్ధంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ చేపట్టకపోవడంతో పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. చౌకధరల దుకాణాల ద్వారా రూపాయికి కిలో చొప్పున కుటుంబంలో ఉన్న లబ్ధిదారులకు నెలకు ఒక్కొ క్కరికి 6 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో జూన్ 2021 నుంచి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 15 కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్నారు. రెండు మూడు నెలలుగా కొన్ని షాపులకు సన్న బియ్యం మరికొన్ని షాపులకు దుడ్డు బియ్యం పంపిణీ జరుగుతుండటంతో పేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
50 శాతం మాత్రమే కార్డుల పంపిణీ
జిల్లా అధికారిక లెక్కల ప్రకారం నేటికీ 50 శాతం మాత్రమే కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరిగినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ప్రకటించగానే జిల్లా వ్యాప్తంగా 16,430 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో అధికారుల పరిశీలనలో కార్డు పొందేందుకు 14,230 మంది అర్హత కలిగినవారు ఉన్నారని అధికారులు తేల్చారు. మిగిలిన 2200 దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. కార్డు పొందేందుకు అర్హత ఉన్న 14,230 మందిలో ఇప్పటి వరకు సుమారు 50 శాతం మందికి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అందజేశారు. మిగతా 50 శాతం మందికి ఎప్పుడిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. వెబ్సైట్లో సాంకేతిక లోపం పేరుతో నిత్యం జాప్యం జరుగుతుండగా, అర్హులైన వారు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 14 వేల 236 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి.
లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు 311 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 423 చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని మొత్తం రేషన్ కార్డుల్లో అంత్యోదయ కార్డులు 15,417 ఉండగా, ఆహార భద్రత కార్డులు 1 లక్ష 98వేల 649, అన్నపూర్ణ 170 కార్డులు ఉన్నాయి.
షాపుల సంఖ్య పెరిగేదెప్పుడు..?
కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో చౌక ధరల దుకాణాల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 423 చౌకధరల దుకాణాల పరిధిలో ఒక్కో షాపునకు కనీసం 700 కార్డులను కేటాయించారు. ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇస్తుండగా ఆ సమయంలో షాపుల వద్ద రేషన్ కార్డు దారులు బారులు తీరుతున్నారు. రేషన్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 7వేల పైచిలుకు కొత్త కార్డులు జారీ చేయడంతో షాపులకు కేటాయించిన కార్డుల సంఖ్య మరింత పెరిగింది. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో మరో ఎనిమిది కొత్త షాపులు ఏర్పాటు కావలసి ఉండగా, నేటి వరకు ఆ ప్రక్రియను అసలు ప్రారంభించనే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని రేషన్ కార్డు దారులు కోరుతున్నారు.